విద్యుత్ సరఫరాలో కొన్నిసార్లు హై వోల్టేజి ఏర్పడుతుంటుంది. అప్పుడు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోతుంటాయి. లేదా వాటిలో ఉన్న ఐసీ చిప్స్ పాడైపోయి ఆ వస్తువులు పనిచేయవు. అలానే మనిషిలో కూడా రక్తపోటు అధికమై తారాస్థాయికి చేరితే శరీరంలో ప్రధాన అవయవాలు కూడా పేలిపోతాయి. అంటే అవి పనిచేయకుండా పోతాయన్నమాట. ముఖ్యంగా మెదడు, గుండె, కిడ్నీలు, కళ్లపై రక్తపోటు ప్రభావం అధికంగా ఉంటుంది.
అధిక రక్తపోటు సమస్యను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే శరీరంలో ప్రధాన అవయవాలు
విఫలమవుతాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిడి మొదలైన కారణాల వల్ల ఈ మధ్యకాలంలో అధిక రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి 100 మందిలో దాదాపు 50 శాతం మందికి ఈ సమస్య ఉంటుందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో హైపర్‌టెన్షన్ లేదా హై బీపీ సమస్య, దానికి కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ గురించి నేటి ఊపిరిలో అవగాహన చేసుకుందాం.
గుండె, రక్తనాళాల్లో ప్రవహించే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడి లేదా పీడనాన్ని రక్తపోటు అంటారు. దీనినే వైద్య పరిభాషలో బ్లడ్ ప్రెషర్ (బీపీ) అని పేర్కొంటారు. సాధారణంగా రక్తపోటు ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే దానిని అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌గా పరిగణిస్తారు. ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే దానిని హైపోటెన్షన్ లేదా లో- బీపీగా పిలుస్తారు. రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ప్రమాదకరమే. రెండు సమస్యలు కూడా ప్రాణాంతకమే. ఇదిలా ఉండగా రక్తనాళాల్లో రక్తం అలల మాదిరి ఉరకలు వేస్తూ ప్రవహించడం వల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడుతుంది.
ఈ ఒత్తిడి గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా, అక్కడినుంచి దూరం వెళ్తున్న కొద్దీ తగ్గుతూ రక్త కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి సిరలకు చేరుకుంటుంది. సిరల ద్వారా మరింత నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్లీ గుండెకు చేరుకుంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన పీడనం ఉండటం వల్ల శరీరమంతటా రక్తపోటు ఒకేలా ఉండదు. అందువల్ల రక్తపోటును జబ్బ మీద కొలుస్తారు. అంతేకాదు, పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, పరిసరాలను బట్టి.. అంటే కొంతమందికి వైద్యులను చూసినా, వైద్య పరికరాలను చూసినా గుండెదడ పెరిగి
రక్తపోటు పెరుగుతుంది.
మనిషి గుండె నిరంతరం కొట్టుకుంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గుండె కొట్టుకునే ప్రక్రియలో అది దగ్గరికి ముడుచుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకు దుంకుతుంది. ఆ సమయంలో రక్తపోటు అధికంగా ఉంటుంది. దీనినే సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఈ పోటు విలువ 100 mmHg నుంచి 140 mmHg ఉంటే దానిని సాధారణంగా పరిగణిస్తారు.
ఇక గుండె వ్యాకోచించినప్పుడు రక్త ప్రవాహ పీడనం తక్కువగా ఉంటుంది. దీనినే డయస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇందులో పీడనం 60 mmHg నుంచి 90 mmHg మధ్య ఉంటే దానిని సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. గతంలో అయితే ఆరోగ్యవంతునిలో రక్తపోటు 120/80గా పరిగణించేవారు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం 140/90ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే వారు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్టుగా గుర్తించి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది.
అధిక రక్త పీడనం (హైపర్‌టెన్షన్ లేదా హై బీపీ) రెండు రకాలు. ఒకటి ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్. ఈ రకం హైపర్‌టెన్షన్‌కు కారణాలు ఉండవు. అంటే ఇది రావడానికి గల కచ్చితమైన కారణాలు చెప్పలేం. రెండోది సెకండరీ హైపర్‌టెన్షన్. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది.
ఇక చికిత్స సమయంలో వైద్యులు సూచించిన హైబీపీ మందులను వాడుతూ ఉండాలి. మధ్యలో వదిలిపెట్టకూడదు. ఇలా చేస్తే రక్తపోటులో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల డోస్ మార్చుకోవాలనుకుంటే వైద్యుణ్ని అడిగి పరిష్కారాలు తెలుసుకోవాలి. అంతేతప్ప మీ ఇష్టం వచ్చినట్టు చికిత్సను మార్చుకోవద్దు.
…?మహేశ్వర్‌రావు బండారి