కాలేజీ ప్రేమ పక్షులు! కలిసి సినిమాలు-షికార్లు! సోషల్ మీడియాలో పోస్టులు! కాలం కరుగుతుంది. ప్రేమ విఫలమవుతుంది. ఎవరిదారి వారిదవుతుంది. కానీ, ఓరోజు అకస్మాత్తుగా ‘సోషల్ మీడియా’.. ఆ గతాన్ని తిరిగి తోడుతుంది. ‘ఐదేళ్ల క్రితం నాటి మధుర క్షణాలు’ అంటూ.. ‘మాజీ’తో దిగిన ఫొటోను స్క్రీన్‌పైకి వదులుతుంది. దాంతో.. జ్ఞాపకాల తేనెతుట్టె కదులుతుంది. మనసులో అలజడి రేగుతుంది. ప్రస్తుత బంధాలపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో కాపురాలనూ కూలుస్తుంది. అదే.. డిజిటల్ హాంటింగ్! మానసిక ఆరోగ్యంతోపాటు బంధాలనూ దెబ్బతీస్తున్న నయా సోషల్ మీడియా ట్రెండ్!
కొన్ని బంధాలు మధ్యలోనే తెగదెంపులు అవుతాయి. విఫల ప్రేమికులు, విడాకులు తీసుకున్న దంపతులు.. ఇలా ఎన్నో జంటలు భారంగానే దూరమవుతాయి. ఒకప్పుడంటే.. వారి జ్ఞాపకాలన్నీ వారివారి మనసులోనే నిలిచి ఉండేవి. ఈ ఆధునిక యుగంలో మాత్రం.. సోషల్ మీడియాలో తిష్టవేసి కూర్చుంటున్నాయి. అకస్మాత్తుగా.. సామాజిక మాధ్యమాల్లో బయటపడుతుంటాయి. సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్‌లు, ఫొటోలు, సంభాషణలు.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఈ జ్ఞాపకాలన్నీ చాలామందిలో భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయి. ‘మాజీ’కి సంబంధించిన పాత పోస్ట్‌లు అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతాయి. కొందరు వాటిని చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. కానీ, చాలామంది ఆ పాత జ్ఞాపకాలకు తిరిగి జీవం పోస్తుంటారు.
తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ ఊహించని జ్ఞాపకాలతో మరికొందరు గత-ప్రస్తుత సంబంధాలను పోల్చి చూస్తుంటారు. ‘అప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో!’ అంటూ భావోద్వేగానికి గురవుతారు. కాలంతోపాటు అందాన్ని, ఆనందాన్ని కోల్పోయామనే బాధలోకి వెళ్తున్నారు. అలా, డిజిటల్ గతం అనేది ప్రస్తుత వాస్తవికతతో పోటీ పడుతూ.. చాలామందిలో భావోద్వేగ అశాంతిని పెంచుతున్నది. చాలా సందర్భాల్లో కొత్త భాగస్వామితో అభద్రత, అపనమ్మకాన్ని కలిగిస్తున్నది.
గుప్తంగా ఉండాల్సిన మధుర జ్ఞాపకాలన్నీ.. వారిని అనుసరిస్తున్న నీడగా మారుతున్నాయి. ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అన్నీ ఓ చెయిన్ లింక్‌గా తయారై.. పండంటి కాపురాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ప్రేమ-పెళ్లి విఫలమై.. ఒంటరిగా మిగిలినవారిపైనా ఈ పాత జ్ఞాపకాలు ప్రతికూల ప్రభావాన్నే చూపుతున్నాయి. వారిలో ఆనందాన్ని నింపేయడానికి బదులుగా.. తీవ్రమైన విషాదంలోకి నెట్టేస్తున్నాయి. విడిపోయిన క్షణాలు, మనసు పడ్డ బాధలు, ఒంటరితనంగా గడిపిన రోజుల్లోకి లాక్కెళ్తున్నాయి. పాత గాయాలను తిరిగి రేపుతున్నాయి. దాంతో, చాలామంది మళ్లీ డిప్రెషన్లోకి వెళ్తున్నారు.
ఇలాంటి సోషల్ మీడియా రిమైండర్లు, డిజిటల్ హాంటింగ్కు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని నిపుణులు చెబుతున్నారు. విడిపోయిన సందర్భంలోనే.. సాంకేతికతతో కూడిన సరిహద్దులు నిర్ణయించుకోవాలి. సామాజిక మాధ్యమాల్లోని ‘మాజీ’కి చెందిన పోస్ట్లన్నీ డిలీట్ చేసేయాలి. సోషల్ మీడియా ఫుట్‌ప్రింట్స్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. అప్పుడే.. ఆ పాత జ్ఞాపకాల సుడిగుండం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.