కొన్ని సంప్రదాయాలు చిత్రంగా ఉంటాయి. కొన్ని ఆలయాల్లో నిలువు దోపిడీ ఇవ్వడం ఆనవాయితీగా ఉంటుంది. ఇంకొన్ని గుళ్లల్లో పొర్లుదండాలు తప్పనిసరి అని ఉంటుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా పాండే గ్రామంలో ఓ ప్రత్యేక ఆచారం కనిపిస్తుంది. దసరా సందర్భంగా జరిగే నవరాత్రోత్సవాలో ఇక్కడ వింత ఆచారం కొనసాగుతుంది. నవరాత్రులన్ని రోజులూ అమ్మవారిని ఆరాధించే భక్తులంతా నిలబడే ఉంటారు.
మగవాళ్లే ఈ ఆచారాన్ని కఠినంగా పాటిస్తారు! దేవీ నవరాత్రుల్లో భాగంగా పాండే గ్రామంలోని దీక్ష తీసుకున్న పురుషులంతా నిల్చునే ఉంటారు. ఈ తొమ్మిది రోజులూ నడుం వాల్చరు సరికదా, కూర్చోరు కూడా! తొమ్మిది రోజులు తెల్లటి దుస్తులు ధరించి, చేతిలో కర్రలు పట్టుకొని ఉంటారు. చెప్పులు ధరించరు.
ఊరంతా తిరుగుతూ హారతి ఇస్తారు. ఒక్క పొద్దు పాటిస్తారు. అందునా ఉప్పు, కారం జోలికి పోకుండా… తీపి పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. కాళ్లు లాగినా, నడుం బిగుసుకపోయినా కూర్చునే ప్రయత్నం చేయరు. నిద్ర ముంచుకొచ్చిన వేళ.. తాళ్లతో కట్టిన ఊయలపై ఛాతీ ఆనించి.. నిలబడే కునుకు తీస్తారు. దాదాపు 350 ఏండ్లుగా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతున్నది.
నవరాత్రి వేళ.. అమ్మవారి ఆరాధనలో భాగంగా ఇక్కడి కాలభైరవుడు నిరంతరం మేల్కొనే ఉంటాడని ప్రతీతి. ఆయనకు తోడుగా, అమ్మవారికి సేవకులుగా గ్రామంలోని మగవాళ్లూ ఇలా నిలబడే ఉంటారన్నమాట! కులమతాలకు అతీతంగా భక్తులు ఈ పద్ధతిని అవలంభిస్తారు.
-పాసికంటి శంకర్, భీవండి