365 రోజులూ దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇంటి పెరట్లలో, వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా లభించే ఈ పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది. ఫలితంగా, గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. బొప్పాయిలో ఉండే ‘పెపైన్’ అనే ఎంజైమ్
ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.
రాత్రి భోజనం తర్వాత బొప్పాయి ముక్కల్ని తీసుకుంటే.. తిన్న ఆహారం ఇట్టే అరిగిపోతుంది. కడుపు తేలికపడుతుంది. ఇక బొప్పాయిలో అధిక మొత్తంలో లభించే ఫైబర్.. మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా ఉంటాయి.
అలాగే, ఇందులోని విటమిన్ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ముడతలను తగ్గించి కాంతిమంతంగా చేస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారూ ఈ పండును తరచూ తినొచ్చు. ఇందులో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా దీనిలో అధిక ఫైబర్, నీటి శాతం వల్ల.. కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. దాంతో, బరువు తగ్గే అవకాశం ఉంటుంది.