ఆ రోజుల్లో పిల్లల ఆటలన్నీ ఆరుబయటే! 2000 సంవత్సరం వరకు పిల్లల జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది. రోజంతా మైదానాల్లో గడిపేవారు. నేటి తరం పిల్లలకు స్మార్ట్ఫోనే గ్రౌండ్‌గా మారిపోయింది. వీడియోగేమ్సే ఆటవిడుపుగా మారాయి. అయితే, ఆరుబయట ఆడుకునే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన తేల్చింది. ఈ ఆటలు వారిలో శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు సామాజిక నైపుణ్యాలనూ మెరుగుపరుస్తాయని వెల్లడించింది.
Parenting | నాటి తరానికి తెర అంటే.. టీవీ మాత్రమే! సినిమా అంటే.. ఆదివారమే! కానీ, ఇప్పటి పిల్లలు రోజంతా స్క్రీన్లోనే గడిపేస్తున్నారు. ఆటలేకాదు, పాఠాలు కూడా స్క్రీన్కు అంకితమై వింటున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, కంప్యూటర్.. ఇలా స్క్రీన్ ఉచ్చులో చిక్కుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. దేశంలో దాదాపు 61 శాతం మంది తల్లిదండ్రులు, తమ పిల్లల స్క్రీన్టైమ్ గురించి ఆందోళన చెందుతున్నారని పలు పరిశోధనల్లో తేలింది. స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్న బాల్యం.. పిల్లల భాషాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతున్నదనీ, వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నదని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. అందుకే, పిల్లల స్క్రీన్టైమ్ తగ్గించాలనీ, వారిని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలనీ సూచిస్తున్నారు.
నైంటీస్ కిడ్స్ దాచుకున్న స్లామ్బుక్స్ను ఒక్కసారి తిరగేయండి. చాలా పేజీల్లో హాబీస్ దగ్గర.. ‘రీడింగ్ బుక్స్’ అనే కనిపిస్తుంది. పుస్తకాలే నేస్తాలుగా గడిచిన బాల్యం వాళ్లది. చందమామ కథలు చదువుతూ.. నిద్రలోకి జారుకున్న తరం వాళ్లది. మరిప్పుడో.. స్కూల్ బుక్స్, హోమ్ వర్క్ తప్ప, వేరే పుస్తకమే తెలియకుండా రోజులు గడిపేస్తున్నారు. కాబట్టి.. మీ పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచండి. ప్రతిరోజూ పడుకునే ముందు.. వారికి ఒక మంచి పుస్తకం ఇచ్చి చదవమనండి. పుస్తకాలు చదవడం వల్ల వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. భాషా నైపుణ్యాలూ మెరుగుపడుతాయి.
నాటికాలం పిల్లలు.. ప్రకృతి ప్రేమికులు. చుట్టూ ఉండే చెట్టూ చేమల్ని చూసే ఎక్కువగా నేర్చుకున్నారు. నేటితరానికి ఇల్లు, స్కూలూ తప్ప.. వేరే ప్రాంతం పెద్దగా తెలియదు. అయితే.. ప్రకృతితో మమేకమైతేనే.. పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సమస్య-పరిష్కార సామర్థ్యాలు మెరుగుపడతాయన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. అందుకే.. ప్రకృతిలో ఉన్న వింతలను, సహజత్వాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వైరస్లు, బ్యాక్టీరియాలు అంటూ భయపెట్టకుండా.. పిల్లల్ని స్వేచ్ఛగా మట్టిలో ఆడుకోనివ్వాలి. నీళ్లలో గెంతనివ్వాలి. ప్రకృతిని ప్రేమించేలా.. వారిని ప్రోత్సహించడం చాలా అవసరం.
90వ దశకంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. ఏ పండుగొచ్చినా ఇళ్లన్నీ జనాలతో అనుబంధాల కలబోతలా కళకళలాడేవి. నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉండటమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో.. ఇప్పటితరం కుటుంబంతో కన్నా సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా గడుపుతున్నది. ఫలితం.. మనిషికి ఉండాల్సిన సహజ భావోద్వేగాలు కూడా మృగ్యమైపోతున్నాయి. ఈ పోకడ.. వారి భవిష్యత్తులో మరిన్ని విపత్కర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి, పిల్లల మధ్య ప్రేమానురాగాలు పెరిగేలా చూడండి. రోజుకు ఒకపూటైనా కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోండి. అన్నదమ్ముల పిల్లలను తరచూ కలుసుకునే పరిస్థితులు కల్పించండి. తద్వారా వారికి బంధాల విలువ తెలిసొస్తుంది.