వానకాలంలో చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. తేమతో కూడిన వాతావరణంలో, చర్మం నిగారింపు కోల్పోతుంది. పోయిన అందాన్ని రెట్టింపుగా పొందాలంటే.. ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ సహజమైన ఫేస్ స్క్రబ్‌లను ప్రయత్నించండి.
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి ఐదు నిమిషాలపాటు బాగా రుద్దుకోవాలి. పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత.. చల్లటినీళ్లతో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకుంటే.. చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్‌మీల్‌ను మెత్తగా, పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ స్క్రబ్‌ను ముఖానికి అప్లయ్ చేసి పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఈ స్క్రబ్.. చర్మంలోని మృతకణాలను తొలగించి, మెరుపు తీసుకొస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మిక్స్ చేయాలి. ఈ స్క్రబ్‌ను ముఖంపై సున్నితంగా రుద్దుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ అందం రెట్టింపు అవుతుంది.