రాముడు లేనిది సీత లేదు.. సీత లేని రాముడు కనిపించడు. ఇది సీతారాముల పవిత్ర బంధం. శ్రీరామనవమి వచ్చిన సరిగ్గా నెల రోజులకు సీతానవమి వస్తుంది. రామాయణం అన్నా సీతాచరితం అన్నా.. ఆ దంపతుల ఆదర్శ జీవనమే. అందునా లక్ష్మీనారాయణుల్లాంటి ఆ దంపతుల జీవన విధానాన్ని నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రతి పూజలో సీతారాములకు నమస్కరించి ఆశీస్సులు పొందమంటారు పురోహితులు. ఆదికావ్యమైన రామాయణం అడుగడుగునా జీవన విలువలను ప్రబోధిస్తే, అందులో సీతమ్మవారి జీవన విధానం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలపరచడానికి మూల సూత్రంగా పరిగణించాలి. అటువంటి జానకీమాత జయంతి నేడు.
వైశాఖ శుక్ల నవమి రోజున యాగం చేయడానికి జనకుడు భూమి దున్నుతుండగా సీతాదేవి దొరికింది. ఆరోజు జానకీ నవమి, జానకీ జయంతి, సీతా జయంతి.. ఇలా పలు ప్రాంతాల్లో పలు పేర్లతో ఈ శుభదినాన్ని పండుగగా చేసుకుంటారు. బీహార్లోని మిథిలాచంల్ అంటే గంగానదికి ఉత్తరాన ఆవలి ఒడ్డున ఉన్న 19 జిల్లాలతో పాటు నేపాల్ భూ భాగాన్నంతా కలిపి మిథిలాంచల్గా పిలుస్తారు. ఈ జిల్లాలతో పాటు ఉత్తరాదిన సీతానవమి పండుగగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇటీవల కాలంలో తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో సీతానవమిని వైభవంగా జరుపుకొంటున్నారు. రామాయణానికి మరో పేరు సీతాయాశ్చరితమ్ మహత్.. అంటే సీతమ్మ వారి చరిత్రగా కూడా వాల్మీకి మహర్షి చెప్పారు. సీత సకల సద్గుణాల సంజాత. సహనం, శక్తి, ధైర్యం, ఓర్పు, సమయస్ఫూర్తి, ప్రలోబపడని మనసు, కష్టాలకు ఓరుస్తూ నేర్పుగా ప్రతీ ఘటనను ఎదుర్కొన్న సామర్థ్యం తదితర లక్షణాలన్నీ కలబోసిన జానకీమాత రామాయణంలో కనిపించే ప్రతీ సన్నివేశం ఏదో ఒక సందేశాన్నిస్తుంది.
రామాయణం ప్రధానంగా సీతకథ. సీత లేకపోతే రామాయణం లేదు. సకల దేశాలకూ భారతజాతి అందించిన ఆదర్శంగా చూపిన దాంపత్య జీవనం, పతివ్రతా ధర్మాలకు ప్రతీక సీత. సీతారాముల దాంపత్యం జగతికి ఆరాధ్యం.. శ్రీరామునికి తగిన ఇల్లాలు సీతమ్మ.. కష్టాల్లో భర్తకు తోడూనీడగా నిలిచిన అనుకూలవతి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ‘భర్తా హి మమదైవతం’ అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ సీత. భార్య లేని భర్తకు పరిపూర్ణత లేదు. భర్త లేని భార్యకు చరిత లేదు. అందుకే భర్త చాటు భార్య అనడం తప్పు. భర్తకు తగ్గ భార్య అనాలి అంటారు మన పౌరాణికులు. జానకి లేని రామచంద్రుడు… చంద్రిక లేని చంద్రుని వలె కాంతిహీనుడయ్యాడని వాల్మీకి చెబుతారు.
సీత లేని రాముడు శక్తిని కోల్పోయి కష్టాల పాలయ్యాడు. సీత చెంతనుండగా గడ్డి పరకను సైతం ఆమె కోసం బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ప్రయోగించిన సీతారాముడు, ఖరదూషణాది పద్నాలుగువేల మంది రాక్షసులను ఒకేఒక్కడుగా మట్టుబెట్టిన శ్రీరాముడు సీతాపహరణం తర్వాత తన శక్తిని కోల్పోయి రావణ సంహారం కోసం వానర భల్లూకాదుల సాయం కోరాడు. అశోకవనంలో సీతను చూసిన ఆంజనేయుడు ఆమెలో రాముని పోలికలను చూశాడు.
ఎక్కడైనా ఒక వ్యక్తిలో తల్లిదండ్రుల పోలికలు, మేనమామలు, తాతల పోలికలు చూస్తాం కానీ, భార్యలో భర్త పోలిక చూడడం కేవలం సీతారాములకే చెల్లింది. అందుకే ‘అస్యాదేవ్యాయథారూపం అంగప్రత్యంగసౌష్టవం.. రామస్యయధారూపం..తస్యేమసితేక్షణా’ అంటూ సుందరకాండలో చెప్తారు. అందుకే ‘శ్రీరామచంద్రుడి వంటి పురుషోత్తముడు లభిస్తాడేమో కానీ, సీత వంటి ఆదర్శచరిత్ర కలిగిన పతివ్రతా తిలకం లభించడం దుర్లభమ’ని స్వామి వివేకానంద తన ప్రసంగంలో అంటారు. ధైర్యం, సాహసం, సహనం ఇలా అనేక లక్షణాలు కలబోసుకున్న పవిత్రమైన దాంపత్య జీవనానికి ప్రతీకగా నిలిచిన సీతమ్మ తల్లి జీవనయానం నేటి ఆధునిక మహిళాలోకానికి ఆదర్శం.
– రంగనాథ్ మిద్దెల