ఆమె చదివింది పదిలోపే! అయితేనేం తనలో దాగి ఉన్న సృజనాత్మకతే ఆమెకు ఆధారమైంది. జీవనోపాధిగా మారి కుటుంబ పోషణలో భాగస్వామిని చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో దొరికే మట్టి గాజులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వాటికన్నా భిన్నంగా, ఆకర్షణీయంగా పట్టు దారాలతో గాజులు చేసి ట్రెండ్ క్రియేటర్‌గా నిలిచింది మెహర్ ఉన్నీసా. మగువల చేతులు విభిన్న వన్నెల్లో మెరిసిపోయేలా పట్టుగాజులతో ముస్తాబు చేస్తున్న కలెక్షన్ యూనిక్ హ్యాండ్‌మేడ్ స్టార్టప్ నిర్వాహకురాలు మెహర్ ఉన్నీసా ప్రయాణమిది..
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఉంటుంది మెహర్ ఉన్నీసా. పదిలోపే ఆమె చదువు ఆగిపోయింది. ఆమె ఏ పనిచేసినా సృజనాత్మకత తొంగి చూసేది. లక్కగాజులు, మట్టిగాజుల కన్నా వైవిధ్యంగా ఏదైనా చేయాలనుకుంది. రబ్బరు గాజులకు పట్టుదారాల పరికిణీలు తొడగడంలో సిద్ధహస్తురాలైంది. ఆమె చేసే సిల్క్ థ్రెడింగ్ గాజులు చుట్టుపక్కల వారిని అమితంగా ఆకర్షించాయి. అలా మెహర్ కళకు రెక్కలు తొడిగినట్టయింది.
చాలీచాలనీ భర్త సంపాదనకు కాసింత అండగా నిలిచే మార్గాల కోసం అన్వేషిస్తున్న మెహర్‌కు… పట్టుదారాల గాజులు ఓ అవకాశంలా కనిపించాయి. చిన్నప్పటి నుంచి అబ్బిన నైపుణ్యానికి మరింత పదును పెట్టేలా భర్త ప్రోత్సాహమూ తోడైంది. కొన్నాళ్లకే డిజైనర్ గాజులు సృష్టించే సృజనశీలి ఆమెలో వెలుగు చూసింది. పట్టుదారాలతో పొందికగా గాజులు చేసి, వాటిపై ఎంతో అందంగా కుందన్లు, రంగురాళ్లు పొదిగి పంచెవన్నెల గాజులను ఆవిష్కరించింది మెహర్. వేడుకకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ గాజులు కూడా అందిస్తున్నదామె. వినియోగదారులు కోరిన కాంబినేషన్, రంగులు, డిజైన్లలో గాజులు సిద్ధం చేసి ఇస్తున్నది. దీంతో అనతి కాలంలోనే ఆంత్రప్రెన్యూర్‌గా నిలదొక్కుకుంది.
2018 నుంచి ఇంటి దగ్గరే గాజులు చేస్తున్న మెహర్ ఉన్నీసా.. ఏడాదిన్నర కిందట వీ హబ్ తలుపు తట్టింది. అప్పటివరకు ఇరుగుపొరుగుకే పరిమితమైన ఆమె డిజైన్లు.. ప్రత్యేక మేళాల్లో తళుకులీనడం మొదలైంది. వీ హబ్‌లో నేర్చుకున్న వ్యాపార మెలకువలు ఆమె సృజనాత్మకతకు మరింత ఊతమయ్యాయి. హ్యాండ్‌మేడ్ గాజులకు విస్తృతంగా ప్రచారం కల్పించడానికి సోషల్ మీడియాపైనా మెహర్ పట్టు సాధించింది! ఇన్‌స్టా పేజీ @collectionuniquehandmadeతో తక్కువ సమయంలోనే వేలాదిమందికి చేరువైంది. రానున్న రోజుల్లో మరిన్ని డిజైన్లతో అతివల మనసు గెలుచుకుంటానని చెబుతున్న మెహర్ ఉన్నీసాకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.
– కడార్ల కిరణ్