నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. పెండ్లయి ఏడాది దాటింది. కాస్త బొద్దుగా ఉంటానని సన్నబడే ఉద్దేశంతో రెండేండ్ల నుంచీ జిమ్‌కి వెళ్తున్నాను. రోజూ బరువులెత్తే వ్యాయామాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం తల్లిని కావాలి అనుకుంటున్నాను. ఈ వ్యాయామాలు ఆపేయాలా? గర్భధారణ మీద వీటి ప్రభావం ఉంటుందా?
బరువు తగ్గడం అన్నది 75 శాతం ఆహారం మీద, 25 శాతం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న కప్పెడు అన్నం, అంతే మొత్తంలో కాయగూరలు, పప్పులాంటివి తినాలి. నిజానికి అన్నానికన్నా ఎక్కువ కూర తినాలి. తినగానే ఓ పది నిమిషాలు నడవాలి. అప్పుడు ఆహారంలోని గ్లూకోజ్‌ని కండరాలు తీసుకుంటాయి. శరీరంలో గ్లూకోజ్ నిల్వ ఉండదు. ఉప్పు, పంచదారలకు దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్ జోలికి పోవద్దు. జ్యూస్‌ల స్థానంలో పండ్లు, కూరగాయల్ని నేరుగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఎవరైనా ఇట్టే తగ్గిపోతారు. ఆరోగ్యమూ బాగుపడుతుంది. ఇక, వ్యాయామం విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకొన్నట్టు బరువు మీద పాతిక శాతం ప్రభావమే చూపుతుంది.
గట్టిగా తిని వ్యాయామం చేస్తే కండపడతారు తప్ప తగ్గరు. ఆహారాన్ని నియంత్రించుకుంటూ వ్యాయామం చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. ఎత్తుకు తగ్గ బరువు అన్నది కూడా త్వరగా నెలతప్పేందుకు ఉపయోగపడే విషయమే. ఇక, నిస్సంకోచంగా బరువులెత్తే వ్యాయామాలు సహా అన్నీ మీరు చేయొచ్చు. ఇవి గర్భధారణ మీద ప్రభావం చూపవు. యోగాలాంటివీ చక్కగా చేసుకోవచ్చు. నెలతప్పాక మాత్రం కొన్ని వ్యాయామాలు చేయకూడదు. మీ పరిస్థితిని బట్టి అప్పుడు డాక్టర్లు అవేంటో చెబుతారు.