షిజోఫ్రేనియా మెదడుకు సంబంధించిన రుగ్మత. మన ఆలోచనలు, భావోద్వేగాలకు ఇది ఆటంకం కలిగిస్తుంది. కౌమార వయసు చివరి దశలో కానీ, వృద్ధాప్యం ఆరంభంలో కానీ మొదలవుతుంది. స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా అందరినీ పీడిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో 20- 30 శాతం మందిలో వ్యాధి తీవ్రత కొంత కాలంపాటే ఉంటుంది. మిగిలిన వారిలో మాత్రం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. షిజోఫ్రేనియా రోగుల్లో 10 శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు అంచనాలు ఉన్నాయి. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం(హల్యూసినేషన్స్), ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, భావోద్వేగాల్లో మొండిగా ఉండటం, అసందర్భమైన ప్రతిస్పందనలు, జ్ఞాపకశక్తి సరిగ్గా లేకపోవడం లాంటివి షిజోఫ్రేనియా లక్షణాలు. అయితే అందరిలో అన్ని లక్షణాలు కనిపించవు. పైగా కొన్ని లక్షణాలు కొంతకాలంపాటే ఉండొచ్చు కూడా. మంచి యాంటిసైకోటిక్ ఔషధాలతో షిజోఫ్రేనియా వ్యాధిగ్రస్తులు కోలుకుంటారు. అయితే ఈ రకమైన మందులు కొన్ని లక్షణాలు తగ్గిస్తాయి కానీ, రోగాన్ని పూర్తిగా నయం చేయలేవు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో చేర్పించాలి.