యదావై విజానాత్యథ సత్యం వదతి విజానన్నేవ సత్యం వదతి విజ్ఞానం త్వేవ విజిజ్ఞాసితవ్య మితి విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి ఛాందోగ్యోపనిషత్తు (7:17:1)
‘సత్యదర్శనుడు మాత్రమే సత్యాన్ని వచిస్తాడు. అందువల్ల విజ్ఞానాన్ని గ్రహించాలని కోరుకోవాలి’ అని సనత్కుమారుడు చెప్పగా నారదుడు ‘భగవన్! విజ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నాడు. వేద మూల మిదం జ్ఞానం అన్నారు. జ్ఞానానికి వేదం మూలమని భావం. వేద విజ్ఞానాన్ని భరద్వాజ మహర్షి ఎంత శ్రమకోర్చి సాధించుకున్నాడో కింది వృత్తాత్తం ద్వారా తెలుస్తుంది.
భరద్వాజ మహర్షి బ్రహ్మ వంశానికి చెందినవాడు.
ఆయనకు వేద విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని ఎంతో పట్టుదల ఉండేది. అందువల్ల తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. వేదాలను పూర్తిగా నేర్చుకునే శక్తి సామర్థ్యాలను తనకు ప్రసాదించమని ప్రార్థించాడు. వేదాధ్యయనానికి భరద్వాజుడికి మూడు జన్మలు అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. అలా మొదటి జన్మలో భరద్వాజుడు రుగ్వేదం పూర్తిగా అభ్యసించాడు. రెండో జన్మలో యజుర్వేదం నేర్చుకున్నాడు. మూడో జన్మలో సామవేదం అధ్యయనం చేశాడు. అయితే, మూడో జన్మ ముగిసిపోయే సమయం వచ్చినా అథర్వణ వేదం, వేదాలలో నిగూఢమైన తత్త్వార్థం పూర్తిగా ఆయనకు తెలియరాలేదు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ‘నీవు వేదాలను మాత్రమే నేర్చుకున్నావు. కానీ అందులో దాగి ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలి.
వేద జ్ఞానం అపారమైనది. ఎంత తెలుసుకున్నా తక్కువే’ అన్నాడు. భరద్వాజ మహర్షి ‘నిజమే! నేను ఇన్ని జన్మలుగా తెలుసుకున్న వేద జ్ఞానం అంతా సింధువులో బిందువు లాంటిదే!’ అని వినయంతో పలికాడు. మనం మన ఒక్క జన్మలో ఏదో కొంత భాగమే మామూలు చదువు కోసం వినియోగిస్తున్నాం. కానీ, భరద్వాజ మహర్షి పూర్తిగా మూడు జీవితాలను వేద విద్యకు అంకితం చేశాడు. అంటే జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమైనదో తెలుస్తున్నది.
.-డా॥ వెలుదండ సత్యనారాయణ