ఆన్లైన్లో జాకెట్లను మాత్రమే విక్రయించే ట్రెండ్‌కు చాలాకాలం క్రితమే శ్రీకారం చుట్టారు కోల్‌కతాకు చెందిన జూహీ పోద్దార్, ప్రియాంకా పాల్. ఇద్దరూ జిగిరి దోస్తులు. ‘సఖియా’ ఆ స్నేహితుల కలలపంట. తమ సంస్థ ద్వారా డిజైనర్ రవికలతో పాటు చీరలు, డ్రెస్సులు విక్రయిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో కష్టనష్టాలు ఎదురైనా, ఉత్సాహంగా అడుగు ముందుకు వేశామని చెబుతారు ఆ ఇద్దరూ. సఖియా స్థాపకుల్లో ఒకరైన ప్రియాంకా పాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి పట్టా అందుకున్నారు.
ఉద్యోగంలో పొదుపు చేసుకున్న డబ్బుతో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. ఇక, వృత్తిరీత్యా టీచర్ అయిన జూహీ ఫ్యాషన్ మీద మక్కువతో సబ్యసాచి లాంటి ప్రముఖ బ్రాండ్స్‌తో పనిచేశారు. ఫ్యాషన్ పట్ల మక్కువ ఇద్దరినీ కలిపింది. అలా మూడేండ్ల క్రితం ఆన్లైన్లో డిజైనర్ బ్లౌజ్‌ల విక్రయాలు ప్రారం భించారు. తర్వాత డిజైనర్ చీరలు, డ్రెస్‌లు కూడా అందుబాటులోకి తెచ్చారు.
జాకెట్‌కు ఫిట్టింగ్ చాలా ముఖ్యమని భావిస్తారు మహిళలు. అందుకే ఉచితంగా ఆల్టరేషన్ చేసిస్తారు. దీంతో చాలామంది ఈ బ్రాండ్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాదు హాల్టర్ నెక్, బస్టీయర్, మహారాణి కట్, నూడుల్ స్ట్రాప్ తదితర పేర్లతో కొత్తకొత్త కటింగ్స్ పరిచయం చేశారు. ప్రస్తుతం సఖియాకు కోల్‌కతాలో పెద్ద కార్ఖానా ఉంది. విదేశాల్లోనూ కస్టమర్లుఉన్నారు. కష్టపడి చేయడంతోపాటు, చేస్తున్న పనిలో సృజనాత్మకతను జోడించడమే తమ విజయ రహస్యమని చెబుతారు జూహీ, ప్రియాంక.