మారుతున్న వాతావరణ పరిస్థితులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. అయినా సరే జనం, ప్రభుత్వాలు ఈ విషయంలో పర్యావరణానికి ముప్పు తెచ్చే పనుల్ని మానుకోవడం లేదు. ఇది పిల్లలుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే తమ హక్కులను కాలరాయడమే అంటూ అంతర్జాతీయ స్థాయిలో తన గళాన్ని వినిపిస్తున్నది పదహారేండ్ల రిధిమ పాండే. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితితోనూ కలిసి పనిచేస్తున్న ఈమె ఇండియా గ్రెటా థన్బర్గ్గా గుర్తింపు పొందింది.
ఉప్పొంగి పొర్లుతున్న నీళ్ల మధ్య మునిగిన నిలువెత్తు శివుడి విగ్రహం… ఉత్తరాఖండ్ వరదల ఉధృతిని అద్దం పట్టి చూపించింది. ఆనాటి విపత్తును టీవీల్లో చూసినా గుండె చలించిపోయేలాంటి పరిస్థితి. రిధిమ పాండేది కూడా ఉత్తరాఖండ్ కావడం గమనార్హం. హరిద్వార్ ఆమె సొంతూరు. 2013లో వరదలు వచ్చేనాటికి తనకు అయిదేండ్లు. వెయ్యి మందికి పైగా జనం చనిపోయి, లక్షకు పైగా ప్రజల్ని నిరాశ్రయుల్ని చేసిన ఆ ఉత్పాతం ప్రభావం రిధిమ ఇంటి మీదా పడింది. తన తల్లిదండ్రుల్నీ ఇంటినీ కోల్పోతానేమోనని ఆనాడే ఆ చిట్టి గుండె భయపడింది. దేవభూమిగా, హాయి గొలిపే ప్రకృతికి ఆలవాలంగా ఉండే తమ ప్రాంతంలో ఇలా ఎందుకు జరిగింది అన్న విషయం పెద్దయ్యేకొద్దీ తెలుసుకుంది. చుట్టూ ఉన్న వృద్ధుల నుంచి తమ కాలానికీ ఇప్పటికీ ఉన్న వాతావరణ మార్పుల గురించీ విన్నది. మానవ తప్పిదాలే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్న విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రభుత్వాల ఉదాసీనతా ఇందుకు కారణమే అనిపించిందామెకు. అందుకే, తొమ్మిదేండ్ల వయసులోనే పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదంటూ భారత ప్రభుత్వం మీద ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో దావా వేసింది. ‘పారిస్ పర్యావరణ ఒప్పందం మీద సంతకం చేసిన భారత్, దాన్ని పాటించేందుకు మాత్రం ఎందుకు కృషి చేయట్లేదు’ అంటూ ఆ కోర్టులో నిలదీసింది. అంతేకాదు, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, పర్యావరణ మార్పులకు సంబంధించి చర్యలు చేపట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రణాళికలు రచించి అమలు చేయాలని కోరింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని పరిశీలించాల్సిన అవసరాన్నీ చెప్పింది. దాదాపు ఏడాదిన్నరపాటు కోర్టులో ఆమె వాదనలు వినిపించింది. అయితే, ఆ తర్వాత ట్రిబ్యునల్ ఈ కేసును కొట్టేసింది. అయినా సరే తాను విరమించుకోలేదు. జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వేదికల మీద తన గొంతును వినిపించే ప్రయత్నం చేసింది.
నిజానికి రిధిమకు పుట్టుకతోనే పర్యావరణంతో అనుబంధం ఏర్పడింది. ఆమె తండ్రి దినేశ్‌చంద్ర పాండే వన్యప్రాణి సంరక్షకుడు, పర్యావరణవేత్త, న్యాయవాది కూడా. తల్లి వినీత పాండే ఉత్తరాఖండ్ రాష్ట్ర అటవీ శాఖలో బీట్ ఆఫీసర్. దీంతో ప్రకృతి గురించీ, జంతువుల గురించీ… పసితనం నుంచే ఆమె వింటూ ఉండేది. ఆ కారణంగా ఆమెకు పర్యావరణ పరిరక్షణ మీద సాధారణ పిల్లలకన్నా ఎక్కువ అవగాహనే ఏర్పడింది. మూడేండ్ల వయసులో జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లినప్పుడు కట్టేసిన ఓ ఏనుగును చూసి ‘అంకుల్ మీరు దాన్ని అలా కట్టేసి ఉంచితే అది ఆడుకోవడానికి ఎలా వెళుతుంది’ అని అడిగిందట అక్కడి ఒక ఉద్యోగిని. భూ గ్రహానికి ఏర్పడుతున్న ముప్పుల్నీ అదే రీతిలో గమనించింది. మరోపక్క స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ అనే పర్యావరణ ఉద్యమకారిణి ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా తన గొంతుకను వినిపిస్తూ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. పర్యావరణానికి ముప్పు తలపెడుతూ పిల్లల హక్కుల్నీ, భవిష్యత్తునీ కాలరాస్తున్నాయంటూ… ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐదు దేశాల మీద ఐక్యరాజ్య సమితిలో గ్రెటాతో కలిసి ఫిర్యాదు చేసిన పదిహేను మంది పిల్లల్లో రిధిమ ఒకరు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి. 2019లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులోనూ రిధిమ పాల్గొంది. భారత్ నుంచి తన గొంతు వినిపించిన ఏకైక బాలిక ఆమె. నార్వే, ఫ్రాన్స్ తదితర దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ వేదికల మీదా తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంది. గంగానది ప్రక్షాళనకు సంబంధించీ, మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు కోసం అడవుల నరికివేత గురించీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాసింది. 2020లో బీబీసీ ప్రకటించిన ప్రపంచంలోని వంద మంది ప్రభావశీలురైన మహిళల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. పోప్ ఫ్రాన్సిస్‌తో కలిసి ప్రపంచ పర్యావరణ మార్పులు, మూగజీవాల సంరక్షణ తదితర అంశాల మీద తీసిన డాక్యుమెంటరీలో ప్రముఖ పాత్ర పోషించింది. పర్యావరణం గురించి అంతకుమునుపు పోప్ రాసిన కొన్ని లేఖల ఆధారంగా దీన్ని రూపొందించారు. ‘ద లెటర్- ఎ మెసేజ్ ఫర్ అవర్ ఎర్త్’ పేరిట తీసిన ఈ డాక్యుమెంటరీని తొలిరోజే 70 లక్షల మంది చూశారు.
రిధిమ మంచి వక్త. ప్రముఖ సామాజిక వేదిక టెడెక్స్లోనూ ఆలోచనాత్మక ఉపన్యాసాలు ఇస్తుంటుంది. వివిధ విద్యార్థుల కార్యక్రమాల్లో ప్రసంగించి ఎంతోమందిని ఈ దిశగా ఆలోచింపజేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించే ఆడవాళ్లకు దన్నుగా నిలిచేలా ఒక సంస్థనూ స్థాపించింది. వాళ్లకు అవగాహన సదస్సులూ నిర్వహిస్తున్నది. ‘పర్యావరణాన్ని కాపాడే దిశగా పడే ప్రతి అడుగూ ఎంతో విలువైనది. అది దీర్ఘకాలంలో సుస్థిర మార్పులకు కారణం అవుతుంది. ప్రజల జీవనశైలిలో పరివర్తన తీసుకువచ్చే దిశగా మా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నాం. నిజానికి మా తరం పర్యావరణానికి చేసిన అపకారం ఏమీ లేదు. కానీ మేము, మా తర్వాతి తరాలు కూడా దీని విష ప్రభావం బారిన పడుతున్నాం. అందుకే మా వంతుగా చేయగలిగిన ప్రతి చిన్న పనినీ చేస్తున్నాం. మేం చేయని తప్పును సరిదిద్దడానికి మా బాల్యాన్ని త్యాగం చేసేందుకు ముందుకు వస్తున్నాం. పెద్దలు కూడా మాతో కలవాలనీ, మరింత బాధ్యతతో ఉండాలనీ కోరుకుంటున్నాం. మనమూ మన ప్రభుత్వాలూ తక్షణమే అర్థవంతమైన చర్యల దిశగా అడుగు వేయడం అత్యవసరం’ అంటూ తన ఆలోచనలను చెబుతున్నది. నిజమే తను చెప్పిన మార్గంలో జనమంతా ఆలోచిస్తే పర్యావరణం స్వచ్ఛంగా తయారవుతుంది.