ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ‘పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్’లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో.. ఈ విషయం వెల్లడైంది. ధూమపానం చేసేవారిని క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. ఫలితంగా.. ఏటా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మనదేశంలో ఈ సంఖ్య.. 13.5 లక్షలుగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాజా అధ్యయనంలో భాగంగా.. ధూమపానం అలవాటు ఉన్న 3,23,826 మందికి సంబంధించిన హెల్త్ డేటాను పరిశీలించారు. 2005 నుంచి 2014 మధ్య వీరి జీవనశైలిని గమనిస్తూ వచ్చారు. వీరిలో చాలామంది ప్రతిరోజూ తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకున్నారు. రోజుకు పది సిగరెట్ల కంటే తక్కువ తాగేవారు.. ఏటా 16 శాతం నుంచి 27 శాతానికి పెరిగారు. అదే సమయంలో.. ధూమపానం పూర్తిగా మానేసిన వారు 19 నుంచి 23 శాతానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ధూమపానం పూర్తిగా పక్కన పెట్టినవారితో పోలిస్తే.. సిగరెట్ల సంఖ్యను తగ్గించిన వారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధూమపానం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు. జీవితకాలాన్ని ఐదు కన్నా ఎక్కువ సంవత్సరాలు తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, కాల్చే సిగరెట్ల సంఖ్యను తగ్గిస్తే ఎలాంటి లాభం ఉండబోదనీ, ధూమపానాన్ని పూర్తిగా పక్కన పెడితేనే మంచిదని సలహా ఇస్తున్నారు.