అమ్మతనం వరం. దాన్ని అందుకోవాలని ప్రతి ఇల్లాలూ కోరుకుంటుంది. నాన్నగా పిల్లలను లాలించాలని పురుషుడూ భావిస్తుంటాడు. అందుకోసం ఆలుమగలు నోములు నోస్తారు. ముడుపులు కడుతుంటారు. అయితే, ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్లు, ఉద్యోగ బాధ్యతలు ఈ తరం దంపతులకు గండాల్లా పరిణమిస్తున్నాయి. గర్భధారణ ఆలస్యం కావడానికి కారణాలు తెలిస్తే.. వాటిని పరిష్కరించుకునే మార్గాలు అన్వేషించొచ్చు. జీవనశైలిలో మార్పులను సరిచేసుకోకపోతే.. సంతానయోగం అందని ద్రాక్షగా మిగిలిపోవచ్చు.
ఉద్యోగం, వ్యాపారం, దైనందిన జీవితంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒత్తిడి ప్రభావం మహిళల కన్నా పురుషులపై ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రభావం వారి దాంపత్య జీవితం మీదా పడుతుంది.
సంతానోత్పత్తి వయసుతోపాటు మారుతుంది. వయసు పెరిగే కొద్దీ అండాల పరిమాణం, సామర్థ్యం తగ్గుతాయి. దీంతో గర్భధారణ కష్టమవుతుంది. 40 ఏండ్లు పైబడిన తర్వాత పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుంది.
హార్మోన్ల అసమతుల్యత కూడా స్త్రీ, పురుషులపై ప్రభావం చూపుతుంది. వయసు పెరిగే కొద్దీ శృంగార జీవితంపై ఆసక్తి తగ్గుతూ వస్తుంది. దీంతో భార్యాభర్తలు సరైన సమయంలో కలవలేకపోతుంటారు. ఫలితంగా గర్భధారణ ఆలస్యమవుతుంది.
అనారోగ్యమైన జీవనశైలి కూడా సంతానోత్పత్తిని దెబ్బతీస్తుందని పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. పోషకాలు లేని ఆహారం, కల్తీ పదార్థాలు, నిద్రలేమి, శారీరక శ్రమ… వీటన్నిటినీ సంతానోత్పత్తికి గండాలుగానే పరిగణించాలి. వీటిని అధిగమించినప్పుడే ఆలుమగలు అమ్మానాన్నలయ్యేది!