తన ముద్దుల తనయ రషా తడానీలో (Rasha Thadani) ఎవరో ఓ లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉండొచ్చని రవీనా టాండన్ (Raveena Tandon) అంటున్నది. మూడు-నాలుగు నెలల వయసు నుంచే రషా హావభావాలు ప్రత్యేకంగా ఉండేవని చెబుతున్నది. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాతో ఈ బాలీవుడ్ సీనియర్ నటి మాట్లాడింది. తన కూతురు రషా బాల్యం మొదలుకొని బాలీవుడ్ అరంగేట్రం, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం దాకా.. అనేక విషయాలను పంచుకున్నది.
“తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్గా రషా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. ఇంత సక్సెస్ మేము అస్సలు ఊహించలేదు. ఆమెను చూసి ఎంతో గర్వపడుతున్నాం!” అంటూ కూతుర్ని ఆకాశానికి ఎత్తేసింది. అయితే.. బాల్యం నుంచే రషాకు గ్లామర్ ఫీల్డ్‌లోకి రావాలనే ఆసక్తి ఉండేదట. చిన్నప్పుడు తాను అరియానా గ్రాండే అవ్వాలనీ, రాక్‌స్టార్‌గా రాణించాలని అనుకునేదట. కాస్త పెద్దయ్యాక.. తల్లిలా స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యిందట.
అందుకే, యాక్టింగ్‌తోపాటు డ్యాన్స్‌పైనా పట్టుసాధించిందని రవీనా వెల్లడించింది. “మూడు నాలుగు నెలల వయసు నుంచే రషా ప్రత్యేకమైన హావభావాలు పలికించేది. అద్దంలో చూసుకుంటూ ఏడుస్తున్నట్లుగా నటించేది. ‘తనలో ఎవరో లెజండరీ నటి ఆత్మ ఏమైనా ఉందా?’, ‘అద్దంలో తన హావభావాలను చూడాలనుకుంటున్నదా!?’ అన్నట్లుగా ప్రవర్తించేది. ఈ విషయాన్ని ఎప్పుడూ మా అమ్మతో అంటుండేదాన్ని. ఆమె నా మాటల్ని కొట్టిపారేసినా.. ఇప్పుడు రషా యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే, నమ్మశక్యంగా లేనట్లు అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. 1990లలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నది రవీనా టాండన్. మొదటి చిత్రం ‘పథర్ కే ఫూల్’తోనే బీటౌన్‌లో ‘గోల్డెన్ లెగ్’గా పేరు తెచ్చుకున్నది.
ఒక్క ఏడాదిలోనే ఎనిమిది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో.. ఇండస్ట్రీ మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్నది. రవీనా నట వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది రషా తడానీ. ‘అజాద్’ సినిమాతో తెరంగేట్రం చేసి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నది. ఇందులో ఆమె చేసిన ఒక్క స్పెషల్ సాంగ్.. ఇంటర్నెట్ను షేక్ చేసింది. అద్భుతమైన మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో దేశవ్యాప్తంగా
కుర్రకారును కట్టిపడేసింది. త్వరలోనే తెలుగు ప్రేక్షకులనూ పలకరించేందుకు రషా సిద్ధమైంది. ఘట్టమనేని వారసుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా చేయనున్న చిత్రంతోనే.. రషా తడానీ కూడా టాలీవుడ్ బాట పట్టనున్నది.