పెరటి తోటలకు ప్రధాన శత్రువులు.. ఎలుకలు. ఏ మొక్క పూసినా-కాసినా రాత్రికి రాత్రే నాశనం చేసేస్తాయి. అయితే, చాలామంది వాటిని నివారించడానికి రసాయన మందులను ఉపయోగిస్తారు. కానీ, అవి మన ఆరోగ్యానికీ హాని కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు. సహజసిద్ధమైన పద్ధతిలో.. ఎలుకలను నివారించవచ్చని చెబుతున్నారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే, ఎలుకలనూ తరిమి కొడుతుంది. ముఖ్యంగా, కృష్ణ తులసి ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసనలు ఎలుకలను తరిమేస్తాయి. కాబట్టి, తోటలో తులసి మొక్కలు పెంచుకోండి. పుదీనా ఆకుల వాసన.. ఎలుకలకు అస్సలు పడదు. కాబట్టి, పెరటి తోటల్లో అక్కడక్కడా పుదీనా మొక్కలు నాటండి. దాంతో, ఎలుకలు అటువైపుగా రావడం మానేస్తాయి. మీకూ తాజా పుదీనా లభిస్తుంది. అలాగే, లావెండర్, రోజ్మేరీ లాంటి మొక్కల వాసనలకూ ఎలుకలు బెదిరిపోతాయి. వీటిని పెంచినా.. మంచి ఫలితం కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి వాసనకూ ఎలుకలు పారిపోతాయి. వంటింట్లో ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటున్న అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను.. కాయలు కాసే మొక్కల దగ్గర వేస్తే, ఎలుకలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయ వాసన కూడా ఎలుకలను నివారించడంలో సాయపడుతుంది. తోటలో ఓ నిమ్మ చెట్టును పెంచితేసరి. కూరగాయల మొక్కల మధ్య.. అక్కడక్కడా బంతి మొక్కలు నాటుకోండి. ఆ మొక్కల నుంచి వచ్చే వాసనకు ఎలుకలు దూరంగా పారిపోతాయి.