Rana Daggubati | ‘రొటీన్‌గా ఉండే పాత్రలు చేయడం కన్నా జిమ్‌లో డంబెల్స్‌తో వర్కవుట్స్ చేయడమే నయం’ అంటాడు కథానాయకుడు రానా.ఎత్తుకు తగిన శరీర సౌష్ఠవంతో భల్లాలదేవుడిగా కనిపించే రానా.. ఇప్పుడు రోమియోలా నాజూకుగా తయారయ్యాడు. విలన్ పాత్రల్లో క్రూరత్వాన్ని ప్రదర్శించే అతని కండ్లు రొమాంటిక్ యాంగిల్లో చూస్తున్నాయి. తొలి చిత్రం ‘లీడర్’ నుంచి త్వరలో రాబోతున్న ‘భీమ్లా నాయక్’ వరకు రానాలో ఎన్నో మార్పులు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విశేషాలు..
సినిమా నా జీవితానికి కొత్తకాదు. నేను పుట్టిందీ, పెరిగిందీ అంతా సినిమా వాతావరణంలోనే. అందుకే సినిమా నా జీవన విధానంగా మారింది. చిత్ర పరిశ్రమలో సరికొత్త కథలతో ముందుకొచ్చేవారు చాలా తక్కువ. ఆ తరహా ప్రయోగాలు నేనెందుకు చేయకూడదనే ఉద్దేశంతోనే పరిశ్రమలో అడుగుపెట్టా. పాత్రకు తగ్గట్లు రిస్క్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. నాకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి’. ఇన్నాళ్లూ టాలీవుడ్, బాలీవుడ్ అనే హద్దులు ఉండేవి. ఆ గీతను చెరిపేసి, ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది ‘బాహుబలి’. బాలీవుడ్ సహా ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తే..ఆసియాలోనే నంబర్‌వన్ స్థానాన్ని చేరుకుంటాం మనం.
ప్రొడక్షన్ నుంచి నటన వరకు అన్నిటిపైనా నాకు అవగాహన ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి నా ప్రస్థానం మొదలైంది. మాది జగమంత సినీ కుటుంబం. నాపై ఇంట్లోవాళ్ల ఒత్తిడి లేదు. ఫలానా కథలు ఎంచుకో, ఇలాంటి సినిమాలే చేయమని నాకెప్పుడూ చెప్పలేదు. చెప్పరు కూడా! ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలోనే రొటీన్‌కు భిన్నంగా ఉండాలని పాటలు, డ్యాన్స్‌లు లేని సినిమాలు చేశాను. ఇప్పుడు ఆ తరహా సినిమాలు మెయిన్‌స్ట్రీమ్ అయిపోయాయి. ఇప్పుడు అందరూ కోరుకుంటున్న మార్పును ఏడేండ్ల కిందటే నేను ప్రయత్నించాను. విభిన్న కథాంశాలు ఎంచుకోవడంలోనే చాలెంజ్ ఉంటుంది. ఈ పాత్రలే చేయాలని ఎన్నడూ పరిమితులు విధించుకోలేదు. ఏ పాత్ర అయినా సరే, ఒక్కసారి ఆకళింపు చేసుకుంటే.. అందులోనే ఉంటా.
సినిమాల్లో ఉండటం, సినిమా వాళ్లతో కలిసుండటం నాకు సరదా. అందుకే సినిమా అంటే నాకు ఉద్యోగం కాదు.. జీవితం. నేను ఎంచుకున్న పాత్ర గురించి అధ్యయనం చేస్తా. అందుకే, ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తులతో ఉంటాను. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో చంద్రబాబునాయుడి పాత్ర కోసం 30 కిలోల బరువు తగ్గాను. క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్ల భారీగా బరువును తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. గుండె, మూత్రపిండాల రుగ్మతలు నాపై దాడిచేశాయి. అయినా పోరాడాను, గెలిచాను. వాటి గురించి ఎప్పుడూ బాధపడలేదు. కారణం, నేను ఎంచుకున్న పాత్ర నాకు సంతృప్తినిచ్చింది.
ఫిట్నెస్ అనేది మన కోసం మనం చేసే పని. నేను ఎప్పుడూ వ్యాయామం ఆపలేదు. ఇప్పుడు వారంలో నాలుగైదు రోజులే వ్యాయామం చేస్తున్నా. మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర సమస్యల నుంచి రిలీఫ్ కావాలంటే జిమ్ చేయాల్సిందే! ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నా జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నా. తాగడం పూర్తిగా తగ్గించేశాను. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పరిమితంగా తీసుకుంటున్నా. ఇది నా కొత్త జీవితం, పూర్తిగా ఆస్వాదిస్తున్నా.
నేను నటించిన ‘విరాటపర్వం’, ‘భీమ్లానాయక్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 1990 ప్రాంతంలో తెలంగాణలో నక్సల్స్ నేపథ్యంలో నిర్మించిన కథ ‘విరాటపర్వం’. దర్శకుడు వేణు ఉడుగుల నిజజీవితం నుంచి పుట్టిన కథ ఇది. నక్సల్ ఉద్యమంతోపాటు ఓ అందమైన ప్రేమకథను ఇందులో చూపించాం. నా సరసన సాయిపల్లవి నటించింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవన్ కల్యాణ్‌తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లా నాయక్’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాల కోసం ప్రేక్షకులతోపాటు నేను కూడా ఎదురుచూస్తున్నా. సాయిపల్లవి, పవన్‌కల్యాణ్ వంటి ప్రతిభ కలిగిన వారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది.
సెలబ్రిటీలు, ధనవంతులకు సమస్యలు వస్తే, అత్యవసర సాయం అవసరమైతే ఎవరికి కాల్ చేస్తారు? ఎవరిని సంప్రదిస్తారు? అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానమే.. నేను, వెంకీ బాబాయ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్. చాలాకాలం తర్వాత ఇద్దరం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ‘రానా నాయుడు’.. యూఎస్‌లో రికార్డులు బ్రేక్ చేసిన ‘రే డో నోవన్’ టీవీ సిరీస్‌కు తెలుగు అనుసరణ. ధనిక, సెలబ్రిటీ కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించే వ్యక్తులుగా ఇందులో కనిపిస్తాం.
చాలామంది ‘పెండ్లయ్యాక ఎంతో మారిపోయావు!’ అంటున్నారు. అందులో వాస్తవం లేదు. మొదట నేను మారాను. తర్వాతే పెండ్లి చేసుకున్నా. అంతేకాని పెండ్లి నన్ను మార్చలేదు. మిహికాతో నా పెండ్లయి ఏడాదిన్నర అయింది. మనకు జోడీగా సరైన వ్యక్తి దొరికితే జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. లేకపోతే కథ వేరే ఉంటుంది. అదృష్టం కొద్దీ మిహికా నా జీవిత భాగస్వామి అయింది. మేం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి విషయంలోనూ ఆమె మద్దతు ఉంటుంది. ప్రతిరోజునూ నా కోసం రొమాంటిక్‌గా మార్చేస్తుంటుంది. కొన్ని అనుభూతులను మాటల్లో వ్యక్తం చేయలేం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood stars childhood pic | లీడింగ్ హీరోల చిన్ననాటి ఫొటో..ఎవరో గుర్తు పట్టారా ?
Bhimla Nayak | భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
Rana Daggubati | రానా ‘సోలో’ సినిమాలపై ఆసక్తి చూపడం లేదా ..?
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
ఆ నలుగురూ..: అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. వెండితెరపై పాటలతో అదరగొడుతున్నారు..!!