పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత.. జీవితాలు వేర్వేరుగా ఉంటాయి. వివాహ బంధంతోపాటే కుటుంబ బాధ్యతలూ పెరుగుతాయి. పిల్లలు, వారి చదువులు.. రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్థిక – ఆరోగ్య సమస్యలూ.. ఇలా ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి. అన్నీ కలిసి భాగస్వాముల మధ్య విభేదాలకు కారణమవుతాయి. అయితే, పెళ్లి తర్వాత భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
‘ఐ లవ్ యూ’ అనే మూడు మాటలు.. ప్రేమికుల కోసమే కాదు. భార్యాభర్తల భావోద్వేగాలతోనూ మ్యాజిక్ చేస్తాయి. ప్రతిరోజూ కాకపోయినా.. సందర్భాన్ని బట్టి మీ భాగస్వామికి ‘ఐ లవ్ యూ’ చెప్పండి. ముఖ్యంగా.. వాలెంటైన్స్ డే, పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో మీ భాగస్వామికి ఓ మంచి కానుకతోపాటు ఈ మ్యాజిక్ వర్డ్స్ చెబితే.. వారి మనసులో రొమాంటిక్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది.
పెళ్లయ్యాక వెళ్లిన హనీమూన్! మళ్లీ ఇద్దరూ కలిసి వెళ్లడానికి తీరికలేని షెడ్యూల్! అయినా.. భార్యతో కలిసి షికారుకు వెళ్లడానికి ప్లాన్ చేయండి. ఇందుకోసం మీ షెడ్యూల్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి కోసం ఒక్క పూర్తిరోజును కేటాయించినా చాలు. ఇద్దరూ కలిసి మార్నింగ్ వాకింగ్.. మధ్యాహ్నానికి మ్యాట్నీ.. రాత్రిపూట క్యాండిల్లైట్ డిన్నర్! అంతే.. పాతరోజులు మళ్లీ ముందుకొచ్చేస్తాయి.
నవ్వు.. జీవితంలో బాధల్ని తరిమేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో.. భార్యాభర్తల మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి, సమయం చిక్కినప్పుడల్లా జోక్స్ చెప్పుకోవడం, నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతులు పంచుకోవడం చేస్తుండాలి. కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూసినా.. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.