Health Tips | ఉద్యోగ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. సగటు జీవిపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో నిద్రలేమి, గుండె సంబంధ రోగాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే కొవిడ్ మహమ్మారి వల్ల ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఫలితంగా, చాలామందిని శ్వాస, ఉదర సంబంధ సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ ‘4 – 7 – 8 బ్రీతింగ్ టెక్నిక్’తో చెక్ పెట్టేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా సులభం. ముందుగా నాలుగు సెకన్ల పాటు ముక్కు ద్వారా శ్వాసను లోపలికి పీల్చుకోవాలి. ఆ తరువాత ఏడు సెకన్ల పాటు శ్వాసను నిలిపివేయాలి. ఆ తరువాత 8 సెకన్ల పాటు శ్వాసను మెల్లగా బయటికి వదలాలి. ఇలా.. రెండు నుంచి నాలుగు సార్లు రిపీట్ చేస్తే సరిపోతుంది.
4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టెక్నిక్‌ను ఫాలో అవ్వడం ద్వారా శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దాంతో, ఆలోచనలు అదుపులో ఉండి.. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు ఈ ఫార్ములాను ఫాలో అయితే.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ విషయం.. బ్రెయిన్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.
శరీరంలో కార్టిసాల్ స్థాయులను తగ్గించడంలో ‘4-7-8 ఫార్ములా’ సాయపడుతుంది. ఫలితంగా, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్రలేమి దూరం అవుతుంది. ఈ ఫార్ములాతో శరీరం పూర్తిగా రిలాక్సయి.. నిద్ర నాణ్యత పెరుగుతుంది.
బ్రీతింగ్ ఎక్సర్సైజులు గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయని అనేక ఫిజియోలాజికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందులోనూ ‘4-7-8 ఫార్ములా’ హృదయ స్పందనలను కంట్రోల్లో ఉంచుతుంది. రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది.
‘4-7-8 ఫార్ములా’ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారిలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి. దీంతో ఊపిరితిత్తులపై భారం తగ్గి.. శ్వాసకోశ సమస్యలూ తగ్గుముఖం పడుతాయి.
ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారా? అయితే, ‘4-7-8 ఫార్ములా’ను ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ శ్వాసను నియంత్రించడంతోపాటు ఆందోళన లక్షణాలను తగ్గిస్తుందని చెబుతున్నారు.