మన శరీర నిర్మాణంలో, ఆరోగ్యంలో ప్రొటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల… కండరాల పెరుగుదల, వాటి మరమ్మతు, బరువు నిర్వహణ, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సాఫీగా ఉండటం మొదలైన ప్రయోజనాలు ఎన్నో సమకూరుతాయి. ప్రొ టీన్ల లోపాన్ని సరిదిద్దుకోవడానికి మాంసం, సముద్ర ఆహారం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, సోయా లాంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. కొంతమందికి మాత్రం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. కాబట్టి, ఇతర పోషకాల లాగే ప్రొటీన్లు కూడా మోతాదు మించకుండా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో అయితే అధిక ప్రొటీన్లు కీడుచేస్తాయి. అధిక ప్రొటీన్లు ఉన్న ఆహార పదార్థాలు ఎవరికి సమస్యాత్మకమో తెలుసుకుందాం.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు: వీరిలో ప్రొటీన్లు శరీరంలో కలిసిపోయే (ప్రాసెసింగ్) ప్రక్రియ కష్టంగా ఉంటుంది. కాబట్టి, అధికంగా ప్రొటీన్లు తీసుకుంటే కిడ్నీలపై మరింత భారం పడుతుంది. సమస్య ముదురుతుంది.
అధిక యూరిక్ ఆమ్లం : అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం, ప్రత్యేకించి రెడ్ మీట్, సముద్ర ఆహారం అధిక యూరిక్ ఆమ్లం సమస్యతో బాధపడేవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అధిక ప్రొటీన్లు శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులను పెంచుతాయి. దీంతో శరీరంలో గౌట్ (కీళ్లనొప్పులు), కిడ్నీల్లో రాళ్లు లాంటి సమస్యలు తలెత్తే ముప్పు ఉంది.
కిడ్నీ సమస్యలు ఉన్న మధుమేహ రోగులు: మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం దోహదపడొచ్చు. కానీ, వారికి ఏదైనా కిడ్నీ వ్యాధిగాని, నెఫ్రోపతీగానీ ఉంటే మాత్రం అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారాలు హాని కలిగిస్తాయి.
కాబట్టి, మీరేదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, ప్రొటీన్లు ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంలో వైద్యుణ్ని గానీ, గుర్తింపు పొందిన పోషకాహార నిపుణుడిని (డైటీషియన్) గానీ సంప్రదించాలి. మీ ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలిని బట్టి వాళ్లు మీకు అనుకూలమైన ఆహార విధానాన్ని సూచిస్తారు. ప్రొటీన్లు మంచివని ఇష్టం వచ్చినంత తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి.