వేసవి కాలంలో పడుకుంటే పదేపదే మెలకువరావడం, అటూ ఇటూ దొర్లడం, అయినా నిద్ర పట్టకపోవడం కొందరి సమస్య. మరికొందరు పొద్దున లేవగానే మళ్లీ నిద్రపోతారు. రాత్రి నిద్ర సరిపోక.. మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇది సమయానికి సంబంధించిన విషయం కాదు. సరిగ్గా నిద్ర పట్టకపోవడమే వేసవిలో అసలు సమస్య. ఎండలు దంచుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ వేడి వాతావరణంలో ఉన్నప్పుడు చెమట పట్టడం సాధారణమే. ఈ అసౌకర్యం వల్ల నిద్ర నుంచి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే శరీరం నీటిని కోల్పోయినప్పుడు గుండె, మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది.
గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాలు బలహీనపడినట్టుగా అనిపిస్తుంది. మెదడు చురుగ్గాలేకపోవడం వల్ల మెలకువ రాగానే లేవాలనిపించదు. నీరసంగా అనిపిస్తుంది. శరీరంలో నీరు తగ్గడమే ఈ పరిస్థితులకు అసలు కారణమని చాలామంది గుర్తించరు. నిద్ర తేలిపోయినా.. మగతగా మంచానికే అతుక్కుపోతుంటారు. ఇలా జరుగొద్దంటే, కంటి నిండా నిద్ర పట్టాలంటే పడుకునే ముందు ఒక గ్లాసెడు నీళ్లు తాగాలి. అలాగే నిద్ర నుంచి మెలకువ వచ్చినప్పుడు మరో గ్లాసు నీళ్లు తాగాలి. అందుకు అనుగుణంగా పడకకు అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. ఉదయం లేవగానే వీలైనంత త్వరగా నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. ఈ వేడి వాతావరణం తగ్గేదాకా వాటర్ బాటిలో, నీళ్ల చెంబో పక్కన పెట్టుకుని పడుకోవడం అలవాటు చేసుకోండి.