ఒకేసారి లక్షలు కావాలంటే మధ్య తరగతి వాళ్లకు కష్టమే! ఎంత పొదుపు చేసినా లక్షలు దాచే పరిస్థితి ఉండదు. అందుకే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ లోన్ కోసం లైన్ కడతారు. కానీ, కొందరికి మాత్రం ఇలా వెళ్తే, అలా రుణం వచ్చేస్తుంది. వాళ్లే నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగులు. వారికి వద్దన్నా.. ఫోన్లు చేసి మరీ పర్సనల్ లోన్ కావాలా అని అడుగుతుంటారు. అందుకు గల కారణాలివే..
స్థిరమైన జీతం: ఉద్యోగులకు ప్రతినెలా ఒకే తారీఖున జీతం పడుతుంది. అందువల్ల బ్యాంకు వాళ్లకు నమ్మకం కుదిరి త్వరగా రుణం ఇచ్చేస్తారు. అలాగే జీతం కూడా సరైన సమయానికి వస్తుంది కాబట్టి ఈఎంఐ కచ్చితంగా కడతారు. సొంత వ్యాపారాలు చేసేవాళ్ల కంటే వీళ్ల దగ్గర క్యాష్ ఫ్లో స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేస్తుంది.
ఇన్కం వెరిఫికేషన్ సులువు: లోను కోసం బ్యాంకుకు ఎవరు వెళ్లినా.. శాలరీ పే స్లిప్లు, ఫార్మ్ 16, బ్యాంకు స్టేట్మెంట్లు వంటివి అడుగుతారు. అప్పుడు మిగతా వాళ్లకంటే శాలరీ తీసుకునే ఉద్యోగులు కావాల్సిన పేపర్లను వెంటనే అందించగలుగుతారు. అలా బ్యాంకు వాళ్లకు వెరిఫికేషన్ సులువు అవుతుంది. అదే స్వయం ఉపాధి కస్టమర్లయితే ఆడిట్ అకౌంట్లు, జీఎస్టీ రిటర్న్, ట్యాక్స్ రిటర్న్ మొదలైనవి చూపించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏదో ఒకదాంట్లో సమస్య ఉండి లోన్ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోతుంది.
క్రెడిట్ స్కోర్: జీతం తీసుకునే వాళ్లే చాలావరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఈఎంఐలో తీసుకోవడం, క్రెడిట్ కార్డులు వాడటం చేస్తుంటారు. దాంతో బ్యాంకు డిపాజిట్లు, సెటిల్మెంట్లు జరగడం వల్ల క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. దాన్ని చూసే బ్యాంకులు ఆ కస్టమర్లను నమ్మి తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాలు ఇస్తాయి. ఒక లోను పూర్తవ్వగానే మరో లోను ఇచ్చేందుకూ సిద్ధపడతాయి. ఇస్తున్నాయి కదా! అని ఎడాపెడా రుణాలు తీసుకుంటే… భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది. ఒక లోన్ తీర్చడానికి మరొక లోన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే.. మీ ఆర్థిక పరిస్థితి దిగజారి పోయిందని అంచనాకు రావొచ్చు. ఇక తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే రుణాలు చేయాలని గుర్తుంచుకోండి.