వర్షాకాలంలో ఆడవాళ్లు అందాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. వానలో తడవడం, మేకప్ చెదిరిపోవడం.. ఇతరత్రా సమస్యలతో సౌందర్య పోషణపై అంతగా దృష్టి పెట్టరు. అయితే.. వానల్లోనూ వన్నె తగ్గకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వాటర్ ప్రూఫ్ మేకప్‌ను ఆశ్రయించడం మంచిది. వర్షంలో తడిసినప్పుడు రెగ్యులర్ ఫార్ములాలు ఏమాత్రం ప్రభావం చూపవు. పైగా.. మేకప్ మొత్తం తడిసిపోయి, ముఖమంతా చికాకుగా మారుతుంది. కాబట్టి, వానల్లో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం మస్కారా, ఐలైనర్, ఫౌండేషన్ సహా మేకప్ సామగ్రి మొత్తం వాటర్ ప్రూఫ్ ఉండేలా చూసుకోండి.
ఈ కాలంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కాబట్టి, సన్‌స్క్రీన్ లోషన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. కానీ, యూవీ కిరణాల ప్రభావం మాత్రం అలాగే ఉంటుంది. అవి చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలా కాకుండా ఉండాలంటే.. మీ స్కిన్‌కు సరిపోయే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా అప్లయి చేసుకోండి.
వానకాలంలో వాతావరణం మొత్తం తేమతో నిండిపోతుంది. ఈ తేమ.. జుట్టును నాశనం చేస్తుంది. వెంట్రుకలు చిట్లడం, రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, జుట్టు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. యాంటి ఫ్రిజ్ హెయిర్ సీరం, హెయిర్ ఆయిల్ లాంటివి వాడాలి. తడి వాతావరణాన్ని తట్టుకునే హెయిర్ స్టయిల్స్ మార్చుకోవాలి.
ఇక తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చర్మాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్‌ను వాడాలి. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే తేలికైన మాయిశ్చరైజర్‌ను తీసుకోండి.