గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దాదాపు ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. వీళ్లంతా కూడా అధికబరువుతోనో లేదంటే, టైప్ 2 డయాబెటిస్తోనో బాధపడుతున్న వాళ్లే కావడం గమనార్హం. ఈ సమాచారం నుంచి ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత వ్యాయామం చేస్తున్న వాళ్లలో దాదాపుగా గుండె రక్తనాళాలకు సంధించిన వ్యాధులు, మరణాల సంఖ్య.. వ్యాయామం చేయనివారితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని తేలింది. వీరిలో కూడా సాయంత్రం వేళ వ్యాయామం చేసినవాళ్లలో ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయట. అలాగని సాయంత్రం వ్యాయామం చేయడం లేదని ఆందోళన చెందవద్దని పరిశోధకుల మాట. ఎందుకంటే ఉదయం వేళ వ్యాయామం గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి మంచిదని కిందటి అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి సమయం ఏదనే దానితో సంబంధం లేకుండా వ్యాయామం చేయాలని మాత్రం గుర్తుంచుకోవాలి.