Pranathi Khanna | సంగీతం చాలామందే నేర్చుకుంటారు. కొందరు వ్యాపకంగా, కొందరు ఉపాధిగా మలుచుకుంటారు. అది కూడా శాస్త్రీయ సంగీతమే. రాక్ మ్యూజిక్ జోలికే వెళ్లరు. ఈమధ్య ఆ పరిస్థితిలో మార్పు వస్తున్నది. అమ్మాయిలు కూడా పాశ్చాత్య రాక్ మ్యూజిక్‌పై ఆసక్తి చూపుతున్నారు. ప్రణతి ఖన్నా ఓ అడుగు ముందుకేసి.. ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది, తనదైన ఓ బ్యాండ్ నిర్వహిస్తున్నది. తనిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని రాక్‌స్టార్. ఆ కబుర్లన్నీ ఆమె మాటల్లోనే..
నాన్న సంజయ్ ఖన్నా కార్పొరేట్ లాయర్. అమ్మ రూత్ ఖన్నా అడ్వర్టయిజింగ్ కంపెనీలో చేసేది. ప్రస్తుతం చర్చిలో పాస్టర్. అక్క అంజలి డాక్టర్. అట్లాంటాలో స్థిరపడింది. మా అంకుల్ కృషన్ ఖన్నా మంచి ఆర్టిస్ట్. ఆయన ప్రభావంతోనే నాకు కళలపై ఆసక్తి పెరిగింది. బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అక్కడితో ఆగకుండా.. గ్రాఫిక్స్, యానిమేషన్వైపు వెళ్లాలనిపించింది. 3డీ గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో మూడేండ్ల కోర్సు చేశాను. కార్పొరేట్ కంపెనీల్లో గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేశాను. ప్రస్తుతం ఇద్దరు మిత్రులతో కలిసి సొంతంగా అడ్వర్టయిజింగ్ కంపెనీ నిర్వహిస్తున్నా. ఆ వ్యాపారం చూసుకుంటూనే, నాకెంతో ఇష్టమైన పాశ్చాత్య సంగీతాన్ని సాధన చేస్తున్నా.
అమ్మానాన్న రాక్ మ్యూజిక్ బాగా వింటారు. ఇంట్లో పార్టీలు జరిగినప్పుడు, నా స్నేహితులు వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపిస్తారు. నేను మొదట్లో ఏమంత గొప్పగా పాడేదాన్ని కాదు. కొన్నిరోజులకు గిటార్ మీద మనసు మళ్లింది. అప్పుడే, బాగా పాడాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు నుంచి సాధన ప్రారంభించాను. ఇంగ్లిష్‌లో పాటలు రాసుకుని, గిటార్ వాయిస్తూ పాడేదాన్ని. క్రమంగా ఫ్రెండ్స్, కజిన్స్‌తో కలిసి రెస్టారెంట్స్, పబ్స్‌లో ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను. మనసులో మాత్రం, గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికా వెళ్లి గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేయాలన్న ఆలోచన ఉండేది. కానీ అక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. అంత డబ్బు పెట్టే పరిస్థితి లేదు. ఆ సమయంలోనే మ్యూజిక్ షోలతో మరింత బిజీ అయిపోయాను. వారానికి ఎనిమిది షోలు ఇచ్చేదాన్ని. మ్యూజిక్‌లో మంచి పేరు రావడంతో మాస్టర్స్ ఆలోచన పక్కనపెట్టాను.
ఇరవై మూడేండ్ల వయసులో నాకంటూ ఓ బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నా. దాని పేరు ‘రాగమఫిన్’. నా సొంత పాటలతో దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. రెండేండ్ల క్రితం మా బ్యాండ్ సభ్యుల్లో చాలామంది బయటికి వెళ్లిపోయారు. నేనూ, ఇంకో గిటారిస్ట్ మాత్రమే మిగిలాం. మేమిద్దరం కలిసి గత ఏడాది ‘పీకే’ పేరుతో కొత్త బ్యాండ్‌తో శ్రోతల ముందుకు వచ్చాం. ‘రాగమఫిన్’ బ్యాండ్ నుంచి విడుదలైన మా మొదటి ఆల్బమ్ ‘టెల్ మీ’ చాలామందికి నచ్చింది. అయితే ‘పీకే’ బ్రాండ్‌తో సోలో పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న దగ్గర్నించి నాకు మరింత పేరు వచ్చింది. నా రెండో ఆల్బమ్ ‘సన్‌షైన్ ఆన్ ది స్ట్రీట్’ని మొదటిసారి మరో మహిళా కళాకారిణితో కలిసి చేశాను. ఆమె ఎవరోకాదు, అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాలో తాప్సీతో పాటు నటించిన ఆండ్రియా. నేను పాడిన పాటలన్నీ నా యూట్యూబ్ చానెల్‌తో పాటు స్పాటిఫైలోనూ ఉన్నాయి.
నేను పాటలు రాస్తున్నప్పుడు, గిటార్ వాయించేటప్పుడు, ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నప్పుడు అమ్మానాన్న నన్ను ప్రోత్సహించిన తీరు మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా టీనేజ్లోనే హోటల్స్, పబ్స్‌లో ప్రోగ్రామ్స్ ఇచ్చినా.. ఏనాడూ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. పైగా గర్వించేవాళ్లు. ఇప్పటికీ నా ప్రతిభ మీద ఎంతో నమ్మకం. పబ్స్‌లో నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది తాగి అసభ్యంగా మాట్లాడేవారు. వెంటపడి వేధించేవారు. అయినా మావాళ్లు ధైర్యంగా ఉండమని చెప్పారే తప్ప, మ్యూజిక్ మానేసి ఇంట్లో కూర్చోమని అనలేదు. నా తల్లిదండ్రుల్లాగే అందరు అమ్మానాన్నలూ ఆలోచించి ఉంటే.. ఇప్పటికే మనకు ఎంతోమంది మహిళా మ్యుజీషియన్లు ఉండేవారు. కానీ, ఆ పరిస్థితి లేదు. రాక్ మ్యూజిక్‌లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో ఎంతో తేడా ఉంది. ఆ వ్యత్యాసం సమసిపోవాలని ఆశ పడుతున్నాను. నా లైవ్ షోలకు అమ్మానాన్న వచ్చి ఎంజాయ్ చేయడం మరిచిపోలేని అనుభూతి.
హైదరాబాదీని అయినందుకే నేను రాక్‌లో కొంత వెనుకబడ్డానేమో అనిపిస్తున్నది. అదే ముంబైలో అయితే సులువుగా పాపులర్ కావచ్చు. ఈ స్థాయికి రావడానికి నేను, ముంబై మ్యుజీషియన్ల కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. కారణం మన దగ్గర అమ్మాయిల రాక్ మ్యూజిక్‌పై చిన్నచూపు. మూడేండ్ల కష్టం తర్వాత నా పేరు, ప్రతిభ దేశమంతా తెలిసిపోయాయి. ఈమధ్యకాలంలో మన హైదరాబాదీ బ్యాండ్లను చూస్తుంటే సంబురంగా అనిపిస్తుంది. కరోనా కారణంగా లైవ్ షోలు దూరమయ్యాయి కానీ, త్వరలో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నా. అమ్మాయిలకు నా సలహా ఒకటే. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉన్నాసరే.. దాన్ని వదిలి పెట్టొద్దు. కష్టనష్టాలు ఎదురైనా ముందడుగు వేయండి. అప్పుడే మీరేమిటో సమాజానికి అర్థం అవుతుంది.
– నిఖిత నెల్లుట్ల
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”