ఇష్టంగా పెంచుకునే మొక్క ఎండిపోతుంటే.. మనసుకు కష్టంగా అనిపిస్తుంది. కానీ, సరైన సంరక్షణ చర్యలు పాటిస్తే.. వాడిపోతున్న మొక్క మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఆరోగ్యంగా పెరిగి.. కొత్త చిగురులు వేస్తుంది. వర్షాల వల్ల నీరు ఎక్కువగా నిలిచి.. మొక్కల వేర్లు కుళ్లిపోతుంటాయి. దాంతో, మొక్కలు వాడిపోతాయి. ఇలాంటి సమస్య కనిపిస్తే.. మొక్కలను నెమ్మదిగా బయటికి తీసి, వేర్లను క్షుణ్నంగా పరిశీలించాలి. ఆరోగ్యకరమైన వేర్లు దృఢంగా, లేత రంగులో ఉంటాయి.
అలా కాకుండా, వేర్లు మెత్తబడిపోయి నలుపు, గోధుమ రంగులో కనిపిస్తే.. కుళ్లిపోతున్నట్లు అర్థం చేసుకోవాలి. కుళ్లిన వేర్లను కత్తిరించి.. కొత్త మట్టిలో మొక్కను తిరిగి నాటాలి. ఆ తర్వాత.. మళ్లీ నాటిన మొక్కలు కోలుకోవడానికి స్థిరమైన వాతావరణాన్ని సృష్టించాలి. కొత్త చిగుర్లు కనిపించే వరకు ఎరువులు వేయకుండా ఉండాలి. అలాగే, నీరు ఎక్కువగా నిలవకుండా.. పెరటి తోటల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇక మొక్కల ఆరోగ్యానికి కాంతి చాలా ముఖ్యం.
వివిధ రకాల మొక్కలకు.. వివిధ రకాల లైటింగ్ అవసరం. ప్రకాశవంతమైన వెలుగు అవసరమయ్యే మొక్కలను చీకటి ప్రదేశాలలో ఉంచితే బలహీనంగా మారుతాయి. నీడ పట్టున పెరిగేవి ప్రత్యక్ష సూర్యకాంతిలో మనలేవు. కాబట్టి, మీ మొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. తెగుళ్లు, కీటకాలు కనిపిస్తే.. ఇతర మొక్కలకు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి. సేంద్రియ మందులు వాడి.. తెగుళ్లను నివారించాలి.
దెబ్బతిన్న భాగాలను తొలగించడం వల్ల.. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందుకోసం పూర్తిగా ఎండిపోయిన కొమ్మలు, ఆకులను మాత్రమే తొలగించాలి. ఒకేసారి మొత్తం భాగాలను కత్తిరించకుండా.. రెండుమూడు రోజులకు ఒక్కో కొమ్మను కత్తిరించాలి. ఇలాంటి మొక్కలు కోలుకోవడానికి.. కొన్ని వారాల సమయం పడుతుంది. కాబట్టి, ఓపిక వహించాలి.