మహిళల్లో కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్).. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఇబ్బంది పెడుతుందట. ముఖ్యంగా వారి మనసుపై ప్రభావం చూపి.. ఏకాగ్రతనూ దెబ్బతీస్తుందట. బాంబే ఐఐటీ పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడించింది. సాధారణంగా పీసీఓఎస్ బారినపడ్డ మహిళల్లో రుతుక్రమం దెబ్బతినడం, ముఖంపై మొటిమలు, అధిక బరువుతోపాటు సంతానోత్పత్తి సమస్యలూ కనిపిస్తాయి.
అయితే, మహిళల మెదడు పనితీరుపైనా పీసీఓఎస్ ప్రభావం చూపుతుందని బాంబే ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. ‘పీర్ రివ్యూడ్ జర్నల్’లో ప్రచురితమైన ఈ పరిశోధనలో 173 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 101 మందికి పీసీఓఎస్ ఉన్నట్లు నిర్ధారణ కాగా, మిగతా 72 మందిలో ఆ సమస్య లేదు. వీరిలో ‘ఏకాగ్రత’ అనేది ఏ స్థాయిలో ఉందో కొలవడానికి పరిశోధకులు రెండు రకాల పరీక్షలు నిర్వహించారు.
ఇందులో భాగంగా, పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళల్లో ఏకాగ్రత కొద్దిగా లోపించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పనుల్లో వీరు నెమ్మదిగా ఉంటున్నట్టు వెల్లడించారు. అంటే, పీసీఓఎస్ సమస్య లేని మహిళలతో పోలిస్తే.. వీరు ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టలేరని చెబుతున్నారు. పీసీఓఎస్ ఉన్న మహిళలు తమ ఏకాగ్రతను మెరుగుపరచుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతోపాటు నిత్య వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలనీ, కంటినిండా నిద్రపోవాలనీ చెబుతున్నారు. ఇక యోగా, ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఏకాగ్రతను మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారు.