పంచలోహ విగ్రహాలు మనకు సుపరిచితమే! పంచలోహ ఆభరణాల సంగతీ తెలిసిందే! ఒకప్పుడు ట్రెండింగ్‌లో ఉండి మాయమైన ఈ నగలు ఫ్యాషన్ దునియాలో మళ్లీ మెరిసిపోతున్నాయి. తక్కువ ధరలో దొరికే ఈ మన్నికైన ఆభరణాలు కస్టమైజ్డ్ డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక వనితల మనసు దోచేస్తున్న పంచలోహ ఆభరణాలపై ఓ లుక్కేద్దాం.
ప్రాచీన కాలం నుంచే పంచలోహ ఆభరణాలు ఉనికిలో ఉన్నాయి. బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము నిర్దేశించిన పాళ్లలో కలిపి పంచలోహాన్ని తయారు చేస్తారు. వీటితో చేసిన ఆభరణాలు అందంతోపాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇందులోని బంగారం సూర్య శక్తిని, వెండి చంద్ర శక్తిని, రాగి జీవశక్తిని, కంచు బలాన్ని, ఇనుము రక్షణను కల్పిస్తాయట. పంచలోహ నగలు ధరించడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయని, రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పసిడి ధరలకు రెక్కలు రావడంతో ప్రత్యామ్నాయంగా పంచలోహ నగలపై కన్నేస్తున్నారు మగువలు. కస్టమైజ్డ్ డిజైన్లలో రూపుదిద్దుకుంటున్న పంచలోహ నగలు సంప్రదాయ వస్త్రధారణపైకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. టెంపుల్ ైస్టెల్ ఇయర్ రింగ్స్, సింపుల్ హారాలు, పెండెంట్స్ ఎత్నిక్ వేర్పైకీ సూటవుతాయి. ఎనామిల్ వర్క్‌తో ముస్తాబైన నెక్లెస్‌లు, గాజులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ బ్లాక్ ఎనామెల్ యాక్సెంట్స్‌తో తయారుచేసిన డిజైన్లు అతివల మనసు దోచేస్తున్నాయి. ఇవి లైట్‌వెయిట్‌తో ఉండటంతో రోజువారీ అలంకరణకు చక్కగా సరిపోతాయి. ప్రముఖ నగల దుకాణాలు కూడా ఈ పంచలోహ జువెలరీని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆన్లైన్లో డిఫరెంట్ డిజైన్లు దొరుకుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేయండి!