మండుటెండలో గొంతు ఎండిపోతున్న వేళ.. చల్లని నీళ్లు అందించిన వ్యక్తికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకొంటాం! వడదెబ్బ తట్టుకునేలా అంబలిని ఉచితంగా అందిస్తే చేతులెత్తి మొక్కుతాం!! భగభగ మండే ఎండల్లో వేలాది మందికి ఉచితంగా అంబలి పంచుతూ చల్లని మనిషి అనిపించుకుంటున్నాడు నిర్మల్‌కు చెందిన పాకాల రాంచందర్. ఎనిమిదేండ్లుగా నిర్మల్ పట్టణంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వేలమంది ఆకలిని తీరుస్తున్నాడాయన.
నిర్మల్‌కు చెందిన బీఆర్ఎస్ నేత పాకాల రాంచందర్.. మనసున్న మనిషి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘పాకాల ఫౌండేషన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. స్వగ్రామం పెంబి మండల కేంద్రంలో తండ్రి పాకాల ముత్తన్న జ్ఞాపకార్థం రూ.1.70 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు. కొవిడ్ సమయంలో మారుమూల గిరిజన గ్రామాలైన గుమ్మెన, ఎంగ్లాపూర్లోని నిరుపేద కుటుంబాలకు రూ.2.70 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
2010లో నిర్మల్‌లోని అప్పటి ఆర్డీవో కార్యాలయం ఎదుట మినరల్ వాటర్‌తో చలివేంద్రాన్ని నెలకొల్పారు. 2016లో పట్టణంలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 వరకు అంబలి పంపిణీ కొనసాగుతుంది. ఎనిమిదేండ్లుగా వేల మందికి ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులతోపాటు ఆర్టీసీ కార్మికులకూ అంబలి అందే ఏర్పాటుచేశారు. అందుకే నిర్మల్‌వాసులు రాంచందర్‌ను ‘అంబలి రామన్న’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. రాంచందర్ భార్య గీతారాణి, కుమార్తె మనీష, కొడుకు మణికంఠ అంబలి తయారీలో ఆయనకు అండగా నిలుస్తున్నారు.
…? మాదాపురం మహేశ్