Sleeping | నిద్రలేమి మాత్రమే కాదు.. అతినిద్ర కూడా అనర్థమేనని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పరిమితికి మించి పడుకున్నా.. లేనిపోని రోగాలు చుట్టుముడతాయని చెబుతున్నాయి. రోజుకు 7- 8 గంటలు పడుకోవడం ఆరోగ్యకరమనీ, అంతకుమించితే.. మంచిదికాదనీ హెచ్చరిస్తున్నాయి.
గుండెకు చేటు: అతి నిద్ర.. గుండెకు చేటు చేస్తుందని అమెరికన్ వాస్ట్ అసోసియేషన్ చెబుతున్నది. ఈ సంస్థ జర్నల్లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. అతిగా నిద్రపోయే వ్యక్తుల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజుకు తొమ్మిది గంటలు నిద్రపోయేవారిని.. కరోనరీ ఆర్టరీతోపాటు హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి.
వెన్నునొప్పి: ఎక్కువసేపు పడుకొని ఉండటం వల్ల వెన్ను సమస్యలు పలకరిస్తాయి. ఇక పడుకొనే పొజిషన్ సరిగ్గా లేకుంటే.. సమస్యలు తీవ్రతరం అవుతాయి. కండరాలు కూడా అలసటకు గురవుతాయి. ఎక్కువసేపు పడుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణ కోల్పోతుందట. దాంతో బరువు పెరిగే అవకాశం ఉన్నదనీ, కాలక్రమేణా.. అది ఒబేసిటీకి దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
తలనొప్పి: అతిగా నిద్రపోయేవారిని తలనొప్పి వేధిస్తుంది. ఎక్కువ సమయం నిద్రలోనే ఉండటం వల్ల ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గుతాయి. మెదడులో ఉత్పత్తయ్యే ఈ హార్మోన్.. మనిషి మానసిక స్థితితోపాటు గ్రహణ శక్తి, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి నియంత్రణలో కీలకంగా ఉంటుంది. ఈ సెరెటోనిన్ స్థాయులు బ్యాలెన్స్డ్గా లేకుంటే.. మైగ్రెయిన్ లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
టైప్-2 మధుమేహం: అతిగా నిద్రపోవడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలేమి, అతినిద్ర.. రెండూ మనిషిలో బలహీనమైన గ్లూకోజ్ టాలెరెన్స్కు దారితీస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా.. అతినిద్ర వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే శక్తి కూడా క్షీణిస్తుంది. ఇవేకాకుండా, ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీరంలో ‘కాగ్నిటివ్ ఫంక్షనింగ్’ తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అధిక సమయం పడుకొనే ఉండటం వల్ల డిప్రెషన్, అలసటకు గురయ్యే ప్రమాదం ఉన్నదని పలు అధ్యయనాల్లో తేలింది. రాత్రిపూట తొమ్మిది గంటలకు పైగా నిద్రపోయేవారు.. ఉదయాన్నే లేవడానికి బద్ధకిస్తారు. దాంతో రోజంతా అలసటగానే ఫీలవుతుంటారు.