అందరు ప్రేమికులు టైంపాస్గాళ్లు ఉండరు. ప్రేమ ఇచ్చిన భరోసాతో జీవితంలో గెలిచి, ఆ ప్రేమను నిలబెట్టుకునే వాళ్లూ ఉంటారు. ఈ యువజంట రెండో కోవకు చెందుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ నీడలో వాళ్ల ప్రేమ చిగురించినప్పుడు.. ఆ అమ్మాయి అప్పుడప్పుడే 18 దాటింది. ఆ యువకుడి వయసు కాస్త ఇటు! కానీ, ఇద్దరూ ఓ ఒడంబడిక చేసుకున్నారు. తమ ప్రేమ నిజమైనదని నిరూపించాలనుకున్నారు. అందుకు, సర్కారు కొలువులు సాధించిన తర్వాతే మనువాడాలని బాస చేసుకున్నారు. వాళ్లే పద్మ, నవీన్.
క్యాంపస్‌లో ప్రేమికులుగా ఆర్ట్స్ కాలేజీ ముందు సబ్జెక్టు గురించి చర్చించుకునేవారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చేదీ చెప్పుకొనేవారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమ ఇచ్చిన కిక్‌తో నవీన్ 2019లో టీచర్ కొలువు కొల్లగొట్టాడు. పద్మ యూజీసీ నెట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో అర్హత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలోనే పీహెచ్‌డీకి ప్రవేశం పొందింది. మరోవైపు నవీన్‌కు ఉద్యోగం రావడంతో వాళ్ల ఇంట్లో అతనికి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. పద్మ కూడా ఉద్యోగం సాధించేవరకు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పొద్దని అనుకున్నా.. ఇంట్లోవాళ్ల తొందర చూసి చెప్పక తప్పలేదు అతనికి.
మొదట్లో వ్యతిరేకించినా.. వాళ్ల ప్రేమలో ఉన్న నిజాయతీ, జీవితంలో నిలిచాకే.. పెళ్లి చేసుకోవాలన్న వాళ్ల నిర్ణయానికి ఆ పెద్దలు ముగ్ధులయ్యారు. అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక చక్కగా పెళ్లి చేస్తామన్నారు. ఇద్దరికీ కలిపి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అలా ప్రేమకున్న పవర్ ఏంటో నిరూపించారు. కొలువుల్లో చేరిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నవీన్ తాను గతంలో చదువుకున్న పాపన్నపేట జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. మెదక్ బాలికల జూనియర్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నది పద్మ. పద్మ పీహెచ్డీ చివరిదశకు చేరగా, నవీన్ కూడా పీహెచ్డీ కోసం అడ్మిషన్ తీసుకున్నాడు.