కూరగాయల్లో ఎన్నోరకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అనేక వ్యాధులను దూరం చేస్తాయి. అయితే, కూరగాయలను ఉడికిస్తే.. వాటిలో పోషకాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిగానే తీసుకుంటే పోషకాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందుతాయని అంటున్నారు. అయితే, ఇలా అన్నిరకాల పదార్థాలను పచ్చిగా తీసుకోవడం కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
క్యారెట్ మాదిరిగా ముల్లంగిని పచ్చిగా తినకూడదు. ఇందులోని గాయిట్రోజెన్స్ అనే పదార్థం.. థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీనిని నేరుగా తీసుకుంటే.. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
పాలకూరలో ఆగ్జలేట్ ఎక్కువ. ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. అతిగా తీసుకుంటే.. మలబద్ధకం ఇబ్బంది పెడుతుంది.
కొన్ని కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఆహారం విషపూరితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా.. కడుపునొప్పి, వాంతులతోపాటు జ్వరం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి, కోడిగుడ్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినడమే మంచిది. కొన్నిసార్లు హాఫ్ బాయిల్డ్ కూడా అనారోగ్యాన్ని కలిగించవచ్చు.
బీన్స్‌ను పచ్చిగా తీసుకుంటే.. కడుపులో హైడ్రోజెనిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా.. వికారం, వాంతులు, విరేచనాలు ఇబ్బంది పెడతాయి.
ఆలుగడ్డల్లో సొలానిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది నరాల సమస్యలు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను కలగజేస్తుంది. కాబట్టి, ఆలుగడ్డలను ఉడికించి తినడమే బెటర్!
పచ్చిగా తినే అవకాశం ఉన్న కూరగాయలను కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదికాదు. పరిమితికి మించి తీసుకుంటే.. కడుపు ఇన్ఫెక్షన్లు, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉడికించిన కూరగాయలతో పోలిస్తే.. పచ్చివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలోని పోషకాలను శరీరం నెమ్మదిగా గ్రహిస్తుంది. దాంతో జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. కొన్నిరకాల కూరగాయల్లో యాంటి న్యూట్రియంట్ గుణాలు ఉంటాయి. అవి ఆహారంలో పోషకాల శోషణను పూర్తిగా నిరోధిస్తాయి. అలాంటి కూరగాయలను ఉడికించి తీసుకోవడమే మంచిది.