తొలి చిత్రంతోనే దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్నది.. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ! ‘మైనే ప్యార్‌కియా’ అంటూ తెరంగేట్రం చేసిన ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. అంతలోనే అభిమానులందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. తన చిన్ననాటి స్నేహితుడు, నటుడు, నిర్మాత అయిన హిమాలయ్ దాసానితో కలిసి పెళ్లిపీటలెక్కింది. తొలి సినిమా ఘనవిజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించకుండానే.. ఇల్లాలిగా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే, పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ.. బీటౌన్‌లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. 56 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం వన్నె తగ్గకుండా.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నది.
భాగ్యశ్రీ – హిమాలయ దాసాని జంట మరోసారి నెట్టింట సందడి చేస్తున్నది. వీరి వివాహమై.. 35 ఏళ్లు దాటిపోయింది. అంతకుముందు కూడా వీళ్లమధ్య స్నేహం – ప్రేమ నడిచింది. అయితే.. ఇన్నేళ్లలో దాసాని ఎప్పుడూ భాగ్యశ్రీకి ప్రపోజ్ చేయలేదట. ఇటీవలే భాగ్యశ్రీ ఎదుట హిమాలయ్ దాసాని మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది భాగ్యశ్రీ. వాటికింద.. ‘హబ్బీ ప్రపోజల్!’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ‘ఈ ఫొటోలు చూసి మా ఆయన ఎంతో రొమాంటిక్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఈ క్షణాలు అంత తొందరగా రాలేదు. పెళ్లికి ముందు కానీ, 35 ఏళ్ల వివాహ జీవితంలో కానీ.. ఆయనెప్పుడూ నాకు ప్రపోజ్ చేయలేదు.
ఈ విషయం ఆయనతో ఎన్నోసార్లు అన్నాను. చివరికి.. ఆ సమయం రానేవచ్చింది’ అంటూ.. తన భర్త హిమాలయ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో పంచుకున్నది. భాగ్యశ్రీ ఫొటోషూట్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దాసాని.. మోకాళ్లపై కూర్చొని భార్యకు ప్రేమగా ప్రపోజ్ చేశాడు. అక్కడే ఉన్న భాగ్యశ్రీ ఫొటోగ్రాఫర్.. ఆ ఆనందకరమైన క్షణాలను కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన భాగ్యశ్రీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మైనే ప్యార్ కియా.. ‘ప్రేమ పావురాలు’గా తెలుగులో అనువాదం కాగా, ఇక్కడా అభిమానులను సంపాదించుకున్నది భాగ్యశ్రీ. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ అడపాదడపా సినిమాలు చేసింది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా చిత్రాల్లో నటించింది. ‘రాధేశ్యామ్’లో ప్రభాస్‌కు తల్లిగా నటించి.. మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. భాగ్యశ్రీ – హిమాలయ్ దాసాని జంటకు ఇద్దరు పిల్లలు. కొడుకు అభిమన్యు దాసాని 2019లో వచ్చిన ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఉత్తమ అరంగేట్ర నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇక కుమార్తె అవంతిక దాసాని.. 2022లో ‘మిథ్య’ అనే వెబ్‌సిరీస్‌తో ఇండస్ట్రీలోకి వచ్చింది.