నమస్తే డాక్టరు గారు. నా వయసు పాతికేండ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. గత ఏడాదిగా నైట్ షిఫ్ట్‌లలో పనిచేస్తున్నాను. కొంతకాలం నుంచీ నాకు నెలసరి సక్రమంగా రావడం లేదు. డాక్టరును సంప్రదిస్తే పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) ఉందని చెప్పారు. నా సమస్యకు రాత్రి ఉద్యోగం ఓ కారణమని అంటున్నారు. నా ఉద్యోగ స్వభావం వల్ల పగటి షిఫ్ట్‌కు మారే అవకాశం లేదు. నన్నేం చేయమంటారు?
కంటినిండా నిద్ర లేకపోవడం కూడా నెలసరి సమస్యకు ఓ ప్రధాన కారణమే. రాత్రి ఉద్యోగం తప్పనిసరి అయినప్పుడు, ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే.. ఏకధాటిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆ సమయంలో ఫోన్లలాంటివన్నీ పక్కన పెట్టాలి. రెండో విషయం.. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా శరీరానికి వ్యాయామం అవసరం. మీ విషయంలోనూ ఇది ముఖ్యం. రోజూ ఒక సమయం పెట్టుకుని వ్యాయామం చేయండి. ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అన్నదీ సరిచూసుకోండి. ఒక వేళ
ఊబకాయం ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. భారతీయ మహిళలకు పొట్ట ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీన్ని ‘విసెరల్ ఫ్యాట్’గా పిలుస్తారు. సన్నగా కనిపించేవారిలోనూ ఈ సమస్య ఉంటుంది. వ్యాయామంతో దీన్ని నియంత్రించవచ్చు. సమతులాహారం కూడా చాలా ముఖ్యం. తిండి, నిద్ర, వ్యాయామం.. ఈ మూడూ సరైన రీతిలో ఉండేలా చూసుకుంటే నెలసరి కూడా సక్రమంగా వస్తుంది. పరిస్థితి మరీ ఇబ్బంది కరంగా ఉన్నా, పిల్లల కోసం ప్రయత్నిస్తున్నా.. గైనకాలజిస్టును సంప్రదించి కొద్ది రోజులు హార్మోన్ మాత్రలు వాడితే సరిపోతుంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్