రక్తపోటుపై రీనల్ డీనర్వేషన్ అస్త్రం
రక్తపోటు.. ఇది మానవ శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలి. అలా కాకుండా రక్తపోటు అధికమైతే పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
రక్తపోటు.. ఇది మానవ శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలి. అలా కాకుండా రక్తపోటు అధికమైతే పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ అధిక రక్తపోటునే వైద్య పరిభాషలో హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటారు. దీని వల్ల ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నారు.
జీవనశైలిలో మార్పులు, ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు వైద్యులు సూచించిన మందులు వాడుతున్నప్పటికీ కొందరిలో రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదు. ఒకేసారి పలు రకాల మందులు వాడినా బీపీ అధికంగానే ఉండే ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘రెసిస్టెంట్ హైపర్ టెన్షన్’ అంటారు. ఇలాంటి రోగులకు ఉపశమనం కలిగించే చికిత్సా విధానమే ‘రీనల్ డీనర్వేషన్’ (ఆర్డీఎన్). మందులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసినప్పటికీ నియంత్రణలోకి రాని అధిక రక్తపోటును ఈ ‘రీనల్ డీనర్వేషన్’ చికిత్సా పద్ధతితో అదుపులోకి తీసుకురావచ్చు. అసలు ఈ ‘రీనల్ డీనర్వేషన్’ చికిత్సా పద్ధతి అంటే ఏంటి?, ఈ చికిత్స ఎలాంటి రోగులకు అందించవచ్చు?, దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏంటి? తదితర అంశాలను
నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
నరాల సంకేతాలే కీలకం!
రక్తపోటును నియంత్రించడంలో గుండె, రక్తనాళాలతో పాటు మెదడు, మూత్రపిండాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటి మధ్య సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా నరాల సంకేతాలు నిరంతరం ప్రసారమవుతుంటాయి. ఈ వ్యవస్థ శరీరంలో రక్తప్రసరణ, ద్రవాల సమతుల్యత, రక్తనాళాల సంకోచం లాంటి ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో ఈ నాడీ వ్యవస్థ అధికంగా క్రియాశీలం కావడం వల్ల మూత్రపిండాలు సోడియం, నీటిని ఎకువగా నిల్వ చేసుకోవడం, రక్తనాళాలు సంకోచించడం లాంటి మార్పులు చోటుచేసుకోవచ్చు. ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మందులు ఈ ప్రక్రియల్లోని వివిధ దశలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. అయితే, సరైన చికిత్స తీసుకుంటున్నప్పటికీ బీపీ నియంత్రణలోకి రాని కొందరు రోగుల్లో మూత్రపిండాల చుట్టూ ఉండే నరాల సంకేతాలను తగ్గిస్తే రక్తపోటును నియంత్రించవచ్చనే ఆలోచనతో రీనల్ డీనర్వేషన్ పద్ధతిని అభివృద్ధి చేశారు.
రీనల్ డీనర్వేషన్ అంటే..
రీనల్ డీనర్వేషన్ అనేది శస్త్రచికిత్సతో ఛాతీని తెరవాల్సిన అవసరం లేకుండా, రక్తనాళాల ద్వారా నిర్వహించే కాథెటర్ ఆధారిత చికిత్సా పద్ధతి. ఇందులో మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే రీనల్ ఆర్టరీల చుట్టూ ఉండే నరాల కార్యకలాపాలను తగ్గించేందుకు ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా తొడ లేదా మణికట్టు ప్రాంతంలోని రక్తనాళం ద్వారా పలుచని, సౌకర్యవంతమైన కాథెటర్‌ను లోపలికి ప్రవేశపెడతారు. వైద్యులు దాన్ని రీనల్ ఆర్టరీల వరకు తీసుకెళ్తారు. అనంతరం వైద్యపరికరం ఆధారంగా రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి లేదా అల్ట్రాసౌండ్ శక్తిని ఉపయోగించి నరాలపై లక్ష్యిత చికిత్స అందిస్తారు. ఈ శక్తి రక్తనాళాల చుట్టూ ఉన్న నరాల కార్యకలాపాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా రక్తపోటును పెంచే నాడీ సంకేతాల ప్రభావం తగ్గవచ్చు. ఇది సంప్రదాయ ఓపెన్ సర్జరీ కాదు. అయినప్పటికీ, రక్తనాళాల్లో పరికరాన్ని ప్రవేశపెట్టే వైద్య ప్రక్రియ కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణుల బృందం పర్యవేక్షణలోనే ఈ చికిత్స నిర్వహించాలి.
ఈ చికిత్స మందులకు ప్రత్యామ్నాయమా?
రీనల్ డీనర్వేషన్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఇది హైబీపీ మందులకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు. చికిత్స అనంతరం కూడా చాలా మంది రోగులు తమ మందులను కొనసాగించాల్సి రావచ్చు. కొందరిలో రక్తపోటు గణనీయంగా తగ్గితే వైద్యులు మందుల మోతాదును పునఃపరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా రక్తపోటు తగ్గుదల రోజువారీ మాత్రలు తీసుకోవడంపై మాత్రమే ఆధారపడకుండా, దీర్ఘకాలం కొనసాగవచ్చనే ఆశ ఉంది. అయితే, ప్రతి రోగిలో ఫలితాలు ఒకే విధంగా ఉండవు. కొందరిలో బీపీ తగ్గుదల స్వల్పంగా ఉండవచ్చు. మరికొందరిలో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించకపోవచ్చు. అందువల్ల చికిత్స ఫలితాన్ని అంచనా వేయడానికి నిరంతర రక్తపోటు పర్యవేక్షణ, వైద్య పరీక్షలు అవసరం.
ఎవరికి ఈ చికిత్సను అందించవచ్చు?
- పలు రకాల రక్తపోటు మందులు సరైన మోతాదుల్లో తీసుకుంటున్నప్పటికీ బీపీ నియంత్రణలోకి రాని రోగుల్లో రీనల్ డీనర్వేషన్ చికిత్స అందించడానికి పరిశీలించవచ్చు. అయితే, ముందుగా బీపీ నిజంగానే నియంత్రణలో లేదని నిర్ధారించాలి. అందుకోసం వైద్యులు ఈ కింది అంశాలను పరిశీలిస్తారు.
- ఇంటి దగ్గర, దవాఖానలో రక్తపోటు కొలతలను సమీక్షించడం.
- మందులను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా తెలుసుకోవడం.
- మూత్రపిండాల వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత లాంటివి బీపీ పెరగడానికి కారణమవుతున్నాయా అనే అంశాలను క్షుణ్నంగా పరిశీలించడం.
- నిద్రలో శ్వాసకు ఆటంకం కలిగించే సమస్యలు, ఇతర మందుల ప్రభావాలను గమనించడం.
- రీనల్ ఆర్టరీల నిర్మాణం, మూత్రపిండాల పనితీరు, చికిత్సకు సంబంధించిన ప్రమాదాలను అంచనా వేయడం.ఈ అంశాలను పరిశీలించిన తర్వాత, అర్హులైన రోగుల్లోనే చికిత్సపై నిర్ణయం తీసుకుంటారు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స అవసరం ఉండదు.
ప్రయోజనాలు-దుష్ప్రభావాలు
రీనల్ డీనర్వేషన్ ద్వారా రక్తపోటును కొంతమేర తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, దీనివల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. కాథెటర్ ప్రవేశపెట్టిన ప్రాంతంలో రక్తస్రావం, రక్తనాళాలకు గాయం, కాంట్రాస్ట్ డై వల్ల మూత్రపిండాలపై ప్రభావం, అరుదుగా రీనల్ ఆర్టరీలో సంకుచితం లాంటి సమస్యలు సంభవించవచ్చు. అందుకే రోగి ఆరోగ్య పరిస్థితి, మూత్రపిండాల పనితీరు, రక్తనాళాల నిర్మాణం, ఇప్పటికే వాడుతున్న మందులను పరిగణనలోకి తీసుకుని వైద్యులు నిర్ణయం తీసుకోవాలి. చికిత్స తర్వాత కూడా బీపీని క్రమం తప్పకుండా కొలవడం, సూచించిన మందులను కొనసాగించడం తప్పనిసరి.
సాధారణంగా రక్తపోటులో నిరంతరం అంటే రోజంతా మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొంతమందిలో ఉదయం వేళల్లో బీపీ పెరుగుదల కనిపించవచ్చు. అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉండే అవశాలుంటాయి. రీనల్ డీనర్వేషన్ నాడీ వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా రోజంతా రక్తపోటు నియంత్రణకు తోడ్పడే అవకాశముంది. అయితే, తెల్లవారుజామున వచ్చే గుండెపోటులు లేదా పక్షవాతాలను ఈ చికిత్స పూర్తిగా నివారిస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అంటే తెల్లవారుజాము సమయంలో రక్తపోటును ఈ చికిత్స ద్వారా నియంత్రించకపోవచ్చు.
చికిత్సపై అవగాహన ముఖ్యం!
మందులతోనూ రక్తపోటు అదుపులోకి రాని రోగులకు రీనల్ డీనర్వేషన్ ఒక అదనపు చికిత్సా అవకాశాన్ని అందిస్తుంది. దీని ద్వారా కొంతమందిలో రక్తపోటు తగ్గి, దీర్ఘకాలిక నియంత్రణ మెరుగుపడవచ్చు. అయినప్పటికీ, ఫలితాలు రోగులందరికీ ఒకేలా ఉండవు. ఒక్కో రోగికి ఒక్కోలా మారుతాయి. ఈ చికిత్సను ఎంచుకునే ముందు ప్రయోజనాలు, పరిమితులు, ప్రమాదాలపై నిపుణుల నుంచి స్పష్టమైన అవగాహన పొందాలి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయకుండా, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, ఉప్పును పరిమితం చేయడం, ఆరోగ్యకరమైన శారీరక బరువును నిర్వహించడం, వ్యాయామం చేయడం, పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం లాంటివి బీపీ నియంత్రణలో
కీలకమైన అంశాలని గుర్తుంచుకోవాలి.
-మహేశ్వర్‌రావు బండారి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

