దసరా అంటేనే.. ఓ పక్క దేవీ నవరాత్రులు, మరో పక్క బతుకమ్మ వేడుకలు. అంతేనా.. నిత్య పూజలు, రుచికరమైన
ప్రసాదాలు. ప్రతిరోజూ ప్రత్యేకమే. ఈ పర్వదినాల్లో ఒక్కో రోజు ఒక్కో రంగు వస్ర్తాలతో అమ్మవారిని అలంకరించే సంప్రదాయమూ ఉంది. మనమూ ఆ ప్రత్యేక వర్ణాల్లో మెరిసిపోదాం!
తెలుపు: ప్రశాంతతకు, స్వచ్ఛతకు శ్వేతవర్ణం సంకేతం. అందుకే, నవ రాత్రుల తొలి రోజు తెలుపు రంగు వస్ర్తాలు ధరిస్తారు..
ఎరుపు: అరుణ వర్ణం శక్తికి సంకేతం. కాబట్టి ఎరుపు రంగు లంగావోణీని ఎంచుకుంటారు అమ్మాయిలు.
నీలం: నీళ్లనూ, నింగినీ ప్రతిబింబించే ఈ రంగు నమ్మకానికి గుర్తు. నీలాంబరంలా నీలం రంగు దుస్తుల్లో అలంకరించుకుంటారు.
పసుపు: హరిద్రాన్ని మంగళకరమైన వర్ణంగా భావిస్తారు. నాలుగో రోజు ఈ వన్నె చీరలో ముద్దబంతిలా ముస్తాబవ్వండి.
ఆకుపచ్చ: ఇది సంపదకు, అదృష్టానికి, ఆరోగ్యానికి చిహ్నం. హరిత వస్ర్తాన్ని ధరించి సంపెంగ పువ్వులా కనిపించండి.
బూడిద రంగు: అటు తెలుపు, ఇటు నలుపు కాకుండా మధ్యస్థంగా ఉండే ఈ వర్ణం మేధావితనానికి, నిగూఢత్వానికి సంకేతం. మీ వస్ర్తాలంకరణా అందుకు తగినట్టు ఉండాలి.
నారింజ: ఈ నిండైన వర్ణం యవ్వనానికి, ఉత్సాహానికి, సంతోషానికి ప్రతీక. ఈ రంగు దుస్తుల్ని ధరించి సింధూరంలా సింగారించుకోండి.
నెమలి పింఛం రంగు: ఈ వర్ణానికి భక్తుల కోరికలను తీర్చే శక్తి ఉందంటారు. నెమలి పింఛం రంగు దుస్తుల్లో నెమలమ్మలా అడుగులేయండి.
గులాబీ: ఆడవాళ్ల మది దోచే వర్ణం. ప్రేమకు, లోతైన భావాలకు ప్రతీక. గులాబీ రంగు పట్టుచీరలో పువ్వులా ప్రకాశించండి.