e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిందగీ ఆ మాటలే ఆశీస్సులు నాకు!

ఆ మాటలే ఆశీస్సులు నాకు!

కుటుంబాన్ని పోషించడంలో నాన్నకు సాయం చేయాలనే ఆరాటం.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశయం.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే లక్ష్యం.. వెరసి చిన్నదా పెద్దదా అనే ఆలోచన లేకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొన్నది మేఘనా ఇంద్రనీల్‌. ఇప్పటివరకు చాలా సీరియళ్ళు చేసినా ‘చక్రవాకం’, రియాలిటీ షోలు, జీ తెలుగు ‘రాధమ్మ కూతురు’ ప్రాజెక్టులే తన జీవితంలో ముఖ్యమైన మూడు అంశాలంటూ ‘జిందగీ’తో ఆమె పంచుకున్న ముచ్చట్లు..

ఆ మాటలే ఆశీస్సులు నాకు!

అమ్మది ఆంధ్రా. నాన్నది గుజరాత్‌. నేను పుట్టింది చెన్నైలో. నేను చదువుకుంటున్న సమయంలో నాన్న బిజినెస్‌లో చాలా నష్టపోయారు. కుటుంబాన్ని పోషించేందుకు నాన్న పడుతున్న కష్టాన్ని చూసి, ఎలాగైనా ఆయనకు అండగా ఉండాలనుకున్నా. డిగ్రీ చేస్తూనే అవకాశాలకోసం ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగేదాన్ని. చిన్నచిన్న యాడ్స్‌లో నటించాను. దూరదర్శన్‌లో వచ్చిన ‘ఓయువు’ అనే తమిళ సీరియల్లో మొదటి అవకాశం వచ్చింది. ఎలాంటి శిక్షణ లేకుండానే నా కెరీర్‌ మొదలైంది.

మొదటి సంపాదన..
నేను నటించింది తమిళ సీరియలే అయినా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ తెలుగువారు కావడంతో ‘మనమ్మాయి’ అంటూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ‘ఓయువు’ తర్వాత ఒక సంవత్సర కాలంలోనే తమిళంలో ‘తంగమే తంగం’తోపాటు మరో ఐదు షార్ట్‌ పీరియడ్‌ సీరియల్స్‌లో నటించా. ఇటీవల చనిపోయిన ప్రముఖ నటుడు వివేక్‌గారితోనూ ఒక సీరియల్‌ చేశాను. అందులో ఆయన డిటెక్టివ్‌, నేను అసిస్టెంట్‌. నా మొదటి పారితోషికం రోజుకు ఐదు వందలు.

అలా తెలుగులోకి..
ఓసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు, మా కజిన్‌తో షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళా. దూరదర్శన్‌ తెలుగులో ‘ముత్తయిదువ’ సీరియల్‌లో మెయిన్‌ రోల్‌ మా అక్కది. అక్కడ నన్ను చూసిన డైరెక్టర్‌ ‘హీరోయిన్‌ చెల్లి క్యారెక్టర్‌ ఉంది, చేస్తావా?’ అని అడిగారు. వెంటనే ఓకే చెప్పేశా. అమ్మానాన్నలకు ఫోన్‌ చేసి ‘ఇక హైదరాబాద్‌లోనే ఉంటాను. ఇక్కడే నటిస్తా. మీరే వచ్చేయండి’ అని ధైర్యంగా చెప్పేశా. అలా ‘ముత్తయిదువ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చా. ఆ సీరియళ్లో వినోద్‌ బాల, రఘుబాబు, రాగిణి సహనటులు. కిషోర్‌గారు డైరెక్టర్‌. అందరూ సీనియర్సే, బాగా పేరున్న నటులే. అయినా, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. వచ్చీరాగానే ఇక్కడి వాతావరణం నచ్చింది. తర్వాత శ్రీకాంత్‌ ప్రొడక్షన్స్‌లో ‘ఆత్మీయులు’, ‘కాలచక్రం’ చేశాను. ‘కాలచక్రం’లో అశోక్‌రావుగారు, శ్రుతిగారు, ఇంద్రనీల్‌ నా సహనటులు. మంజులా నాయుడు గారు డైరెక్టర్‌. ‘కాలచక్రం’ చేస్తున్నప్పటినుంచే ఇంద్రనీల్‌ తెలుసు. త్వరగానే మేం మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరికీ ‘చక్రవాకం’లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్‌ టైమ్‌లోనే మా స్నేహం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకున్నాం. ఈ సీరియల్‌ ద్వారా నటిగా మంచి గుర్తింపు లభించింది. అంతేకాక, నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తితో జీవితాన్నీ పంచుకున్నా. మా పెండ్లి నెలరోజులు కూడా నిలవదనుకున్నారు చాలామంది. ఆ మాటల్ని ఆశీర్వాదంగానే స్వీకరించాం. ఎవరేమనుకున్నా మా జీవితం, మా నిర్ణయం అనుకునే సాగిపోయాం.

అందరూ కోప్పడ్డారు..
‘కాలచక్రం’లో ఇంద్రనీల్‌ సవతి తల్లి పాత్ర చేశా. అప్పటికి నా వయసు ఇరవై ఒకటి. ‘చక్రవాకం’లో అత్తాఅల్లుళ్ళుగా చేశాం. అంత చిన్నవయసులో తల్లిపాత్రలేంటని మా అమ్మతోపాటు చాలామంది అడ్డు చెప్పారు. కానీ నాకు అవే కంఫర్ట్‌గా అనిపించాయి. మంజులా నాయుడుగారి డైరెక్షన్‌లో వచ్చిన ‘కనులు మూసినా నీవాయే’తోపాటు మరో నాలుగైదు సినిమాల్లో నటించా. ఎందుకో నాకు సినిమాలు సరిపడవనిపించింది.

ఆ మాటలే ఆశీస్సులు నాకు!

డాన్స్‌ షోలు..
మా అనుబంధంలో నన్ను బాధించిన ఒకే ఒక్క విషయం మిస్‌క్యారేజ్‌. అప్పుడు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా. ఇండస్ట్రీ వల్లే అలా జరిగిందనే కోపంతో, దాదాపు ఆరేండ్లు కెమెరాకి దూరంగా ఉన్నా. అయితే, ‘నీతోనే డాన్స్‌’ షోలో పార్టిసిపేట్‌ చేద్దామన్నాడు ఇంద్ర. ఆయన మంచి డాన్సర్‌. డాన్స్‌ షో టైటిల్‌ గెలవాలనేది తన కోరిక. నేనూ చిన్నప్పటినుంచే భరతనాట్యం, వెస్ట్రన్‌ నేర్చుకున్నా. కానీ సీరియళ్ళలోకి వచ్చాక డాన్స్‌ చేయడం మానేశా. అయితే ‘నీతోనే డాన్స్‌’ ప్రోగ్రామ్‌లో చేద్దామని ఇంద్ర పట్టుబట్టడంతో దాదాపు పదిహేడేళ్ళ తర్వాత 2017లో మళ్ళీ డాన్స్‌ చేశా. ఒకటో రెండో ఎపిసోడ్స్‌ చేస్తామనుకున్నాగానీ టైటిల్‌ గెలుస్తామనుకోలేదు. తర్వాత ‘ఇస్మార్ట్‌ జోడీ’ చేశాం. టైటిల్‌ గెలవకపోయినా నాగురించి, మా అనుబంధం గురించి ఈ షో ద్వారా అందరికీ తెలిసింది. ఈ రెండు షోల వల్లే నా మీద నాకు శ్రద్ధ పెరిగింది. బరువు తగ్గాలని డిసైడయ్యా.

‘రాధమ్మ కూతురు’ ప్రత్యేకం..
ఇప్పటివరకు దాదాపు నలభై సీరియల్స్‌లో నటించా. కానీ అన్నిటికన్నా ‘రాధమ్మ కూతురు’ వ్యక్తిగతంగా నాకు నచ్చిన ప్రాజెక్ట్‌. సెట్‌లో ఆర్టిస్ట్‌లకన్నా, నా సావాసం ఎక్కువగా మిగతావారితోనే. వంటవాళ్ళు, సెట్‌ బాయ్స్‌ అందరితోనూ మాట్లాడుతా. అప్పుడప్పుడు వంట కూడా చేస్తా. అందరూ ఆప్యాయంగా పలకరిస్తుంటే, వారందరితో కష్టసుఖాలు పంచుకోవాలనిపిస్తుంది. సమాజానికి ‘ఫీడ్‌ ద హంగ్రీ’ ద్వారా నాకు చేతనైనంత సాయం చేస్తున్నా. గత ఏడాది లాక్‌డౌన్‌లో బాగా చేశాం. ఈ ఏడాది లాక్‌డౌన్‌ తర్వాత చేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే, లాక్‌డౌన్‌లో చేసేందుకు చాలామంది ముందుకొస్తారు. కానీ లాక్‌డౌన్‌ తర్వాత జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, బాయ్స్‌కి వెంటనే పనులు దొరకవు. అందుకే, లాక్‌డౌన్‌ తర్వాత స్నేహితుల సహకారంతో అవసరమున్న వాళ్ళకి సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.

  • ప్రవళిక వేముల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ మాటలే ఆశీస్సులు నాకు!

ట్రెండింగ్‌

Advertisement