మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. తనకు టీకాలన్నీ సరిగానే వేయించాం. తరచుగా కడుపునొప్పి అంటున్నాడు. మూత్ర పరీక్ష చేయిస్తే అంతా నార్మల్‌గానే వచ్చింది. పొట్ట స్కాన్ చేయిస్తే.. కడుపులో కొన్ని గ్రంథులు ఉబ్బి ఉన్నాయని చెప్పారు. ఇలా గ్రంథులు ఉబ్బడం ప్రమాదమా? దాని కారణంగానే కడుపునొప్పి వస్తుందా?
పది సంవత్సరాలలోపు పిల్లల్లో కడుపునొప్పి సాధారణమే. పేగులలో సాధారణ చలనం వల్ల కూడా పిల్లలకు కడుపులో నొప్పి కలుగుతుంది. ఇలాంటి నొప్పి అప్పటికప్పుడు వస్తుంది. కాసేపటికి తగ్గి పోతుంది! మీ అబ్బాయి ఎదుగుదల, ఆకలి సరిగా ఉండి, నీరసంగా ఉండనంత వరకు, మిగతా లక్షణాలేవీ లేనట్లయితే కంగారు పడొద్దు. మీ అబ్బాయికి చేసిన స్కాన్‌లో పొట్టలో గ్రంథులు ఉబ్బినట్టు గుర్తించారని చెప్పారు. మెడ భాగంలో ఉండే గ్రంథులు ఉబ్బినట్టే, పొట్టలోని గ్రంథులు కూడా ఉబ్బుతాయి.
ఈ సమస్యను ‘మీజెంటింక్ లింఫెడినైటిస్’ అంటారు. ఇది చాలా సాధారణమైన సమస్యే. కంగారు పడాల్సిన పనిలేదు. ఇలా జరగడం ఏ ప్రమాదకరమైన జబ్బుకీ సంకేతం కాదు. పిల్లలకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇచ్చినా కడుపునొప్పి వస్తుంది. పండ్లు తినడం మంచిదే. కానీ, పండ్లు, పండ్ల రసాలు ఎక్కువ మొత్తంలో తీసుకున్నా, పాలు ఎక్కువ మొత్తంలో (పావు లీటరు కంటే ఎక్కువ) తాగినా ఈ సమస్య రావొచ్చు. మీ అబ్బాయి విషయంలో ఈ సమస్య సీరియస్‌గా కనిపించడం లేదు. వైద్యులు చెప్పిన సలహాలు పాటిస్తే సరిపోతుంది.