కలువ కళ్లకు కాటుకే అందం! నయనాలకు నల్లరంగుపులిమితేనే.. అతివ అలంకరణ పరిపూర్ణం అవుతుంది! అయితే, ఈ అందమైన కాజల్ వెనక అపాయం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. మార్కెట్లో లభ్యమవుతున్న కాటుకల్లో చాలావరకు రసాయనాలతో నిండినవే ఉంటున్నాయి. ఫలితంగా అందాన్నిచ్చే కాటుక కంటగింపుగా మారుతున్నది.
కళ్లు ఎంతో సున్నితమైనవి. వాటి చుట్టూ ఉండే కణాలు మరింత నాజూకుగా ఉంటాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కాటుకలు దొరుకుతున్నాయి. వాటిలో ఎక్కువ శాతం రసాయనాలు, నూనెలు, వ్యాక్స్ వాడి తయారుచేస్తున్నారు. అలాంటి కాటుకను కళ్లకు తరచుగా పెట్టుకోవడం, రోజంతా అలాగే ఉంచుకోవడం ఎంతో ప్రమాదకరం. కాటుకలో ఉండే రసాయనాల వల్ల కళ్లు పొడిబారతాయి. కంటి చుట్టూ దురద పుడుతుంది. చేతులతో రుద్దడం వల్ల కళ్లు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే.. కళ్లు దెబ్బతింటాయి కూడా. కాటుకలో వాడే వ్యాక్స్ వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. కళ్ల వాపు, దద్దుర్లు వంటి లక్షణాలూ కనిపిస్తాయి. కాటుకను రెగ్యులర్‌గా పెడితే.. కళ్ల చుట్టూ మచ్చలు రావడం, కళ్లలోంచి నీరు కారడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా.. కాటుక వాడేముందు ఎక్స్పైరీ తేదీని తప్పకుండా చూసుకోవాలి. గడువు దాటిన కాజల్‌ను పెట్టుకుంటే.. కొన్నిసార్లు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, కళ్ల అందాన్ని రెట్టింపు చేసే కాటుకను సహజసిద్ధంగా తయారుచేసుకోవచ్చు. అలాంటివి వాడుకుంటే ఎలాంటి ఇబ్బందీ రాదు.