పాలలో కలుపుకొనేందుకు బయట రకరకాల పొడులు కొని వాడుతున్నాం. అయితే వాటిలో చక్కెరలు అధికమని ఇటీవలి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, వాటి ఖరీదు కూడా ఎక్కువే. ఇంట్లోనే ఏవైనా ఆరోగ్యకరమైన పొడులు తయారు చేసుకోవచ్చా?
పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఇవి పిల్లల సమగ్ర ఎదుగుదలకు దోహదపడతాయి. అయితే పిల్లలతో పాలను తాగించేందుకు అందులో రకరకాల ఫ్లేవర్లు వచ్చేలా పొడుల్ని కొని కలుపుతున్నాం. నిజంగానే వీటిలో చక్కెరలు ఎక్కువ. నిల్వ ఉంచేందుకు రసాయనాలూ వాడతారు. వీటికి భిన్నంగా అటు రుచిగా ఉంటూ ఆరోగ్యాన్నిచ్చే పొడులను మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. పిల్లలూ పెద్దలు ఎవరైనా వీటిని తాగొచ్చు. అంతేకాదు, ఎవరి అభిరుచిని బట్టి వాళ్లు ఈ పొడులను తయారు చేసుకునే వీలూ ఉంది. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బాదం పప్పు: 100 గ్రా
జీడిపప్పు: 25గ్రా
వాల్నట్స్: 50 గ్రా
పిస్తా: 25 గ్రా
బెల్లం పొడి: 100-150 గ్రా
డార్క్ కొకోవా పొడి: 25 గ్రా
డ్రైఫ్రూట్లన్నిటితోపాటు బెల్లంపొడిని మిక్సీలో వేసి తిప్పి, కొకోవా పొడినీ జోడించాలి. వీటన్నిటినీ బాగా కలిపి గాలి చొరబడని సీసాలో పోసి ఉంచుకోవాలి. డ్రైఫ్రూట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్లు దీన్ని హాయిగా ఆస్వాదించొచ్చు.
కావాల్సిన పదార్థాలు
రాగిపొడి: 100 గ్రా
కొకోవా పొడి (తీపి కలపనిది): 50 గ్రా
బెల్లం పొడి: 100 గ్రా
అన్నిటినీ బాగా కలుపుకొంటే, చాక్లెట్ రుచితో పాలలో కలుపుకొనే పొడి తయారవుతుంది.
కావాల్సిన పదార్థాలు
బాదం: 50 గ్రా.
గుమ్మడి గింజలు: 20గ్రా.
పొద్దుతిరుగుడు గింజలు: 20గ్రా.
చియా గింజలు: 20 గ్రా.
ఓట్స్: 20 గ్రా.
పాలపొడి: 50గ్రా.
బెల్లం పొడి: 50 గ్రా.
గింజలన్నిటితోపాటు ఓట్స్, బాదంను కూడా కలిపి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాలపొడి, బెల్లం పొడులను ఈ మిశ్రమానికి జోడించాలి. గాలి చొరబడని డబ్బాలో పోసి ఉంచుకోవాలి. గ్లాసు పాలకు ఒక టేబుల్ స్పూన్ పొడి కలుపుకొంటే చక్కటి రుచితో పాలు తాగొచ్చు.
ఈ పొడులలో ప్రిజర్వేటివ్‌లు (నిల్వకోసం వాడే రసాయనాలు), అధిక చక్కెరలు, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్లు, రుచిని పెంచేందుకు వాడే టేస్ట్ ఎన్హ్యాన్సర్లు ఉండవు. కాబట్టి శక్తినిచ్చేందుకు ఇవి చక్కటి ప్రత్యామ్నాయాలు. నిజానికి స్టోర్ల నుంచి మనం కొనే పొడుల్లోని అధిక చక్కెరలు పిల్లలను అత్యుత్సాహపరుస్తాయి. ఇంట్లో చేసుకునే పొడులతో పోలిస్తే పోషక విలువలూ చాలా తక్కువ. వీటిలో ఉండే గింజల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, లో శాచురేటెడ్ ఫ్యాట్లు మంచి కొవ్వుల్ని దేహానికి అందిస్తాయి. అంతేకాదు, చక్కటి ప్రొటీన్, పీచులు కూడా వీటిలో ఉంటాయి. డ్రైఫ్రూట్లు, గింజల్లో యాంటి ఆక్సిడెంట్లూ ఎక్కువగా దొరుకుతాయి.
ఇవి జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. ఈ పొడుల్లో విటమిన్ ఇ, బి6, నియాసిన్, ఫోలేట్, మినరల్స్, మెగ్నీషియం, జింక్, పొటాషియంలాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బెల్లంలో శరీరానికి అత్యవసరమైన ఐరన్ లభిస్తుంది. ఇది పిల్లల్ని చురుకుగా ఉంచుతుంది. ఇక, పిల్లల ఎముకలు, పళ్లను రాగిలో ఉండే కాల్షియం దృఢంగా తయారుచేస్తుంది. మోస్తరు మోతాదుల్లో తీసుకొనే కొకోవా… పొడికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, చక్కటి భావోద్వేగాలు, సృజనాత్మక ఆలోచనల పెంపునకు సాయపడుతుంది. మొత్తానికి ఈ పొడులు పోషకాల విషయంలో పాలకు సాటీమేటీ అన్నమాట. బయట కొనే వాటితో పోలిస్తే మంచి ఆరోగ్యాన్నిచ్చి, తక్కువ ఖర్చుతో అయిపోయే ఇవి అమ్మల బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.