అందంగా కనిపించడానికి చాలామంది ‘మేకప్’ వేసుకుంటారు. రంగులు, పౌడర్లు అద్దుకొని.. ముఖానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే, ఎంత ఖరీదైన మేకప్ వేసుకున్నా.. ప్లాస్టిక్ పువ్వులానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. మేకప్ లేకుంటేనే.. సహజమైన పుష్పంలా అందంగా వికసిస్తారు. అందుకే.. కింది సూచనలు ఫాలోకండి.. మేకప్‌కు ప్యాకప్ చెప్పేయండి.
ఔట్ఫిట్.. మిమ్మల్ని అందంగా చూపిస్తుంది. ఎంత మేకప్ వేసుకున్నా, ఔట్ఫిట్ సరిగ్గా లేకుంటే.. ఆల్ ఔటే! అందుకే, మీ శరీరాకృతికి తగ్గట్టుగా దుస్తులను ఎంచుకోండి. మీ స్కిన్‌టోన్‌ను హైలైట్ చేసేలా వాటి రంగులు ఉండాలి. పాదరక్షలు కూడా ఔట్ఫిట్లో భాగమే! కాబట్టి మీ వస్త్రశైలికి సరిపోయేలా, మీరు నడవడానికి సౌకర్యంగా ఉండేలా పాదరక్షలు సెలెక్ట్ చేసుకోండి. ఇక ఔట్ఫిట్లో మరో కీలకాంశం.. హ్యాండ్‌బ్యాగ్! మీ దుస్తులు, పాదరక్షలకు అనుగుణంగా హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకుంటే.. అందమంతా మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది.
సిరుల కురులు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే.. మీ జుట్టుతో జట్టు కట్టండి. ముందుగా మీ జుట్టు ఎలా ఉందో అర్థం చేసుకోండి. అందుకు తగ్గట్టుగా మీ హెయిర్ స్టయిల్‌ను మార్చేయండి. ఎప్పుడూ ఒకేరకంగా ఉంచకుండా.. మీ కేశాలంకరణలో నచ్చిన ప్రయోగాలు చేయండి. అంతేకాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే, మీరూ అందంగా కనిపిస్తారు. అందుకోసం.. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి. అవి మీ జుట్టు పెరుగుదలలో, దృఢంగా ఉంచడంలో సాయపడుతాయి. ఇక షాంపూలు, కండీషనర్లలోనూ రసాయనాలు లేనివి ఎంచుకోండి.
మంచి ఆకృతిలో ఉండే కనుబొమ్మలు.. మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి. మీ కళ్లు, ముఖానికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి. మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చడంలో ఐబ్రోస్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే, రెగ్యులర్‌గా ఐబ్రోస్ షేప్ చేయించుకోండి. కొందరు ఒత్తయిన కనుబొమ్మలతో ఆకట్టుకుంటే.. మరికొందరు పల్చని ఐబ్రోస్‌తో ‘ఔరా!’ అనిపిస్తారు. మరి.. మీది ఏ కేటగిరీనో ముందుగా తెలుసుకోండి. అందుకు తగ్గట్టుగా కనుబొమ్మలను మలుచుకోండి.
ముఖంపై ముడతలు, మచ్చలు లేకుంటే.. ఎలాంటి మేకప్ అవసరం లేదు. వయసు పెరిగేకొద్దీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో వయసు మీదపడినట్టుగా అనిపిస్తుంది. మారిన జీవనశైలి, కొన్ని అలవాట్లు, ఎండలో తిరగడం, పర్యావరణ కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ఇలా అనేక కారణాలతో చర్మంపై ముడతలు వస్తుంటాయి. దాంతో ఇరవైలలోనే నలభైలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అలాంటి వారు జీవన శైలిలో మార్పులు చేసుకొని.. ముఖాన్ని అందంగా మార్చేసుకోండి.
మీ ముఖ కవళికలు, పెదాలపై చిరునవ్వు.. మీ అందాన్ని మరింత ఎక్కువ చేస్తాయి. హాయిగా నవ్వితే.. మెదడుకు ప్రశాంతంత, మనసుకు ఆహ్లాదంతోపాటు అందం కూడా రెట్టింపు అవుతుంది. ఇక మీ దంతాలు ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు.. ముఖ సౌందర్యాన్ని పెంచడంలోనూ ముందుంటాయి. మిలమిల మెరిసే తెల్లని దంతాలుంటే.. గలగల నవ్వినప్పుడు మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.