పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని అనేక అధ్యయనాలు తేల్చాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తోపాటు యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సంస్థ కూడా.. ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. మహిళల్లో ఈ హృద్రోగ కేసులు పెరుగుతున్నాయి. వయసు పైబడటం, హార్మోన్ల ప్రభావం అతివల గుండెను బలహీనపరుస్తున్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక రుగ్మతలు.. మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నదట. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడి స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. 55 ఏళ్లు దాటినవాళ్లలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటున్నదట. మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల.. రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం కూడా.. రక్తనాళాల్లో వాపు, అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఇక.. పురుషులతో పోలిస్తే మహిళల రక్త ధమనులు ఇరుకుగా ఉంటాయట. ఫలితంగా వారిలో బీపీ పెరిగి.. గుండెపోటుకు దారి తీస్తుంది. వీటితోపాటు ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిరాశ వంటివి కూడా ఆడవాళ్లలో హార్ట్ ఎటాక్స్ రావడానికి కారణం అవుతున్నాయి. అలాగే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, గర్భధారణ సమస్యలు లాంటి పరిస్థితులు కూడా.. గుండె జబ్బుల ప్రమాదానికి దోహదం చేస్తున్నాయి.
పురుషులతో పోలిస్తే.. మహిళల్లో గుండెపోటు లక్షణాలు వేరుగా ఉంటున్నాయని హృద్రోగ నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, తల తిరగడం, చలి చెమటలు పట్టడం.. కామన్‌గా కనిపించే లక్షణాలు. వీటితోపాటు ఆడవాళ్లలో మెడ, దవడ, గొంతు, కడుపుతోపాటు వీపుసహా వివిధ భాగాల్లో నొప్పిలాంటి లక్షణాలు ఉంటున్నాయట. వాంతులు, వికారం వంటివీ కనిపిస్తున్నాయట. అందుకే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.