చలికాలంలో చాలామంది వేడినీళ్లను తాగుతుంటారు. జలుబు లక్షణాలతోపాటు గొంతు, ముక్కు, ఛాతీలోని శ్లేష్మాన్ని తగ్గించడంలో వేడినీళ్లు సమర్థంగా పనిచేస్తాయి. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతి కూడా లభిస్తుంది. అయితే, రోజంతా వేడినీళ్లు తాగితే.. ఆరోగ్యానికి కీడు జరిగే అవకాశమే అధికమట. ఎక్కువ వేడిగా ఉండే నీటిని తాగడం వల్ల నోటిలోని కణజాలం, అన్నవాహిక దెబ్బతినే ప్రమాదం ఉన్నదని.. యురోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాసూటికల్ అండ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.
శరీర ఉష్ణోగ్రత కంటే నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించింది. వేడినీటిని ఎక్కువగా తీసుకుంటే.. కడుపులోని ఆమ్లాల సమతుల్యత దెబ్బతింటుందట. దాంతో అసిడిటీ, గుండెలో మంట, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడినీళ్లు త్వరితగతిన చమట, మూత్రంగా మారుతాయి. వెంటనే బయటికి వచ్చేస్తాయి. దాంతో, శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా, అధిక వ్యాయామం చేసేవారికి తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఇక వేడినీటితో దాహం తగ్గి తక్కువ నీళ్లు తాగుతారు. అదికూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రెగ్యులర్‌గా వేడినీళ్లు తాగితే దంత సమస్యలూ వస్తాయి. టేస్ట్ బడ్స్ దెబ్బతిని, కాసేపటి వరకు ఏది తిన్నా రుచి తెలియకుండా పోతుంది. అందుకే, గోరువెచ్చని నీటిని మితంగా తాగడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.