పెరటి తోటల్లో పండ్ల మొక్కలు పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. నచ్చిన మొక్కను తీసుకొచ్చి నాటుతారు. అయితే, ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా.. కొన్ని మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఎత్తు పెరిగినా.. దిగుబడి మాత్రం కనిపించదు. ఇందుకు కారణం.. భూమిలో ఉండే సమస్యలే!
పండ్ల మొక్కలు ఏపుగా, దృఢంగా పెరిగినప్పుడే దీర్ఘకాలం దిగుబడిఇస్తాయి. అందుకోసం మొక్కల్లో పొడవైన, బలమైన వేరు వ్యవస్థ ఉండాలి. అందుకు అనువైన భూమి ఉన్నప్పుడే.. వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. లేకుంటే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి కూడా తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. పండ్ల మొక్కల పెంపకానికి ముందే భూపరీక్షలు చేయించాలి. నేల లోతు, రకాన్ని బట్టి అనువైన పండ్ల మొక్కలను ఎన్నుకోవాలి. మొక్కల వేరువ్యవస్థకు ఆటంకం కలిగించని నేలల్లో పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక భూమిలో సున్నపు పొరలు ఉంటే పండ్ల మొక్కల వేర్లు సరిగాపెరగవు.
భూమిలో సున్నం అధికంగా ఉంటే, మొక్కల పెరుగుదలకు అవసరమైన ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మపోషకాలు అందకుండా పోతాయి. దాంతో, వాటి ఎదుగుదల తగ్గిపోయి, మొక్కలు బలహీనంగా తయారవుతాయి. కాబట్టి, పండ్ల మొక్కల పెంపకానికి ఎంచుకున్న పెరటిలో సున్నపు పొరలు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా.. నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగరప నేలలు, ఒండ్రు భూములు పండ్ల మొక్కల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు అంత అనుకూలంగా ఉండవు. ఇక నేల లోతును బట్టి కూడా మొక్కల ఎంపిక ఉంటుంది. 90 సెం.మీ. మించి ఉంటే.. మామిడి, సపోట, పనస, నేరేడు లాంటి మొక్కలు పెంచుకోవచ్చు. 60-90 సెం.మీ మధ్యలో ఉంటే.. జామ, దానిమ్మ, రేగు, నిమ్మ, ఉసిరికి అనుకూలంగా ఉంటుంది. అదే.. 45-60 సెం.మీ ఉంటే.. అరటి, బొప్పాయి, సీతాఫలం లాంటివి మంచి దిగుబడిని అందిస్తాయి. కాబట్టి, నేల రకాన్ని బట్టి పండ్ల మొక్కలను ఎంపిక చేసకోవాలి. ఈ విషయంలో రాజీపడితే.. కేవలం రెండుమూడేళ్లలోనే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.