డయాలిసిస్… ఇటీవలి కాలంలో అత్యధికంగా వినిపిస్తున్న చికిత్సా విధానం పేరు ఇది. గత 20 ఏండ్లతో పోల్చితే మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వీరికి సమాంతరంగా డయాలిసిస్ రోగుల సంఖ్య కూడా అధికమవుతున్నది. మన దేశంలో సుమారు 12 నుంచి 17 శాతం మంది శాశ్వత కిడ్నీ రోగులు ఉన్నట్లు వైద్య నివేదికలు తెలుపుతున్నాయి. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే కిడ్నీలు పూర్తిగా విఫలమవుతున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
సాధారణంగా మూత్రపిండాలు విఫలమైన 90 శాతం మంది రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యను సైలెంట్ కిల్లర్‌గా చెబుతారు. ఇక కిడ్నీ విఫలమవడానికి ప్రధాన కారణం మధుమేహ వ్యాధి. 100 మంది శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో 50 మంది కేవలం షుగర్ వల్లనే ఈ సమస్యకు గురవుతున్నారు. మూత్రపిండాలు విఫలమైన వారందరికీ డయాలిసిస్ అవసరం పడుతుంది. సాధారణంగా రోగులకు హీమో డయాలిసిస్(హెచ్డీ) పద్ధతిలో డయాలిసిస్ చేస్తుంటారు. ఇందుకోసం రోగులు వారంలో రెండు మూడు సార్లు తీవ్రత ఆధారంగా దవాఖానలకు వెళ్లి డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అటు సమయం, ఇటు ఆర్థిక భారం తప్పదు. అలాగని డయాలిసిస్ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించి సమయం, డబ్బు ఆదా చేయడంతో పాటు దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలిగించేందుకు పెరిటోనియల్ డయాలిసిస్ (పీడీ) ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఈ పెరిటోనియల్ డయాలిసిస్ సత్ఫలితాలు ఇస్తున్నందున ఎంతోమంది రోగులకు ఈ విధానం ఒక వరంగా మారింది. అసలు పెరిటోనియల్ డయాలిసిస్ అంటే ఏంటి? డయాలిసిస్‌లో ఉన్న రకాలు ఎన్ని, పెరిటోనియల్ డయాలిసిస్ ఎలాంటి రోగులు చేయించుకోవాలి? దీని ఫలితాలు, చికిత్సా విధానం తదితర అంశాలను నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ భూషణ్‌రాజ్ ద్వారా నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మూత్రపిండాల పనితీరు తగ్గిన రోగులందరికీ డయాలిసిస్ అవసరం ఉండదు. సాధారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి తాత్కాలిక వైఫల్యం. దీనినే టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఈ దశలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అకస్మాత్తుగా ఏర్పడుతుంది. ఒకటి రెండు నెలల్లోనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ దశలో ఉన్న రోగులకు నెల నుంచి రెండు నెలల కాలం పాటు చికిత్స తీసుకుంటే ఇబ్బంది తొలగిపోవచ్చు. రెండోది కిడ్నీల శాశ్వత వైఫల్యం. దీనినే పర్మినెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఈ దశలో మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిని, పనిచేయడం మానేస్తాయి. అయితే, మూత్రపిండాల్లో తాత్కాలిక వైఫల్యమైనా, శాశ్వత వైఫల్యమైనా మొదట ఔషధాలతో చికిత్స చేస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ దశ పూర్తిగా అడ్వాన్స్డ్ స్టేజ్‌కి వచ్చినప్పుడు మాత్రమే డయాలిసిస్ సూచిస్తారు. డయాలిసిస్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ తీవ్రతపై ఆధార పడి ఉంటుంది.

శరీరంలో చేడు నీటి శాతం బాగా పెరిగిపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు డయాలిసిస్ అవసరం పడుతుంది. రక్తంలో మందులకు కూడా తగ్గనంత ఎక్కువ స్థాయిలో సీరం పొటాషియం, ఆమ్లాలు పెరిగిపోయినప్పుడు వైద్యులు డయాలిసిస్ చేయాల్సిందిగా సూచిస్తారు. అంతేకాదు రక్తంలో పెరిగిపోయిన సీరం క్రియాటిన్ శరీరంలోని ఇతర భాగాల పనితీరు మీద దుష్ప్రభావం చూపినప్పుడు, రక్తంలో విషపూరిత పదార్థాలు పెరిగిపోయి, ఆకలి పూర్తిగా తగ్గిపోయిన సందర్భాలు డయాలిసిస్ చేయడానికి సంకేతాలుగా చెప్పవచ్చు.
డయాలిసిస్ అనేది స్థూలంగా రెండు రకాలు. అందులో ఒకటి హీమో డయాలిసిస్ (హెచ్డీ), రెండోది కంటిన్యూయస్ ఆంబ్యూలట్రీ పెరిటోనియల్ డయాలిసిస్ (సీఏపీడీ) హీమో డయాలిసిస్: హీమో డయాలిసిస్‌లో రోగికి యంత్రం సహాయంతో రక్తం శుద్ధి చేస్తారు. రోగి రక్తనాళంలోకి ఒక సన్నటి పైప్ (క్యాథటర్)ను అమర్చడం ద్వారా లేదా ఎ.వి.ఫిస్టులా అనే మైనర్ సర్జరీ చేసి రక్తాన్ని డయాలిసిస్ యంత్రానికి పంప్ చేసి రక్తం శుద్ధి చేస్తారు. హెచ్డీ డయాలిసిస్ చేయించుకోవాలంటే రోగి వారంలో రెండుమూడుసార్లు హాస్పిటల్‌కు రావల్సి ఉంటుంది.

పెరిటోనియల్ డయాలిసిస్: ఇది బ్లెడ్లెస్ టెక్నాలజీ. ఈ విధానంలో రోగి డయాలిసిస్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రైళ్లు, బస్సు, విమానాల్లో కూడా ఈ డయాలిసిస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతిలో రక్తం సహజ పద్ధతిలో శుద్ధి అవుతుంది. రోగి కడుపులో బొడ్డు కింద ‘స్వాన్ నెక్ క్యాథటర్’ అనే ట్యూబ్‌ను అమరుస్తారు. ఈ ట్యూబ్‌కు పెరిటోనియల్ బ్యాగ్స్ అమరుస్తారు. ఇందులో రెండు బ్యాగ్‌లు ఉంటాయి. ఒక బ్యాగ్‌లో 2 లీటర్ల పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. మరో బ్యాగు ఖాళీగా ఉంటుంది. ఈ వ్యవస్థను రోగి కడుపులోని ట్యూబ్‌కు కనెక్ట్ చేసినప్పుడు కడుపులో ఉన్న నీరంతా ఖాళీ బ్యాగులోకి వచ్చేస్తుంది. ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న బ్యాగులోని నీరు కడుపులోకి వెళ్తుంది. ఈ ప్రక్రియలో కడుపులోని ‘పెరిటోనియల్ మెబ్రెన్స్’ జల్లెడలా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తాన్ని సహజ పద్ధతిలో నీటితో కడుగుతాయన్నమాట. దీనివల్ల ఎలాంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవు. ప్రతీ రోజు మూడుసార్లు పీడీ చేయాల్సి ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడుసార్లు చేసుకోవాలి. పెరిటోనియల్ డయాలిసిస్ పద్ధతిలో నీటిని ఎంత సమయంలో కడుపులోకి పంపాలి, కడుపులో నుంచి ఎంత సమయంలో బయటికి తీయాలనేదాన్ని వైద్యుల సూచన మేరకు రోగి స్వయంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ‘సైక్లర్’ అనే యంత్రం అమర్చుకుంటే నీటిని సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. దానంతట అదే కడుపులోని నీటిని ఖాళీ బ్యాగులోకి పంపడం, ఫ్లూయిడ్ బ్యాగులోని నీటిని కడుపులోకి పంపుతుంది.
పెరిటోనియల్ డయాలిసిస్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుంది. హెచ్డీ డయాలసిస్ కోసం వారంలో మూడుసార్లు దవాఖానకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతి డయాలిసిస్‌కు నాలుగైదు గంటల సమయం పడుతుంది. పీడీలో అయితే దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేదు. డయాలిసిస్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. నడుము బెల్టు దగ్గర బ్యాగ్స్‌ను అమర్చుకుంటే దాని పని అది చేసుకుంటుంది. మన పని మనం చేసుకోవచ్చు.