Vinayaka Chavithi | ఏకదంతుడు వెలసిన క్షేత్రాలు తెలంగాణలో అనేకం. కాజీపేటలో శ్వేతార్క గణపతిగా, రేజింతల్లో సిద్ధి వినాయకుడిగా, ఆవంచలో ఏకశిలా ఐశ్వర్య గణపతిగా.. ఇలా ఊరికో తీరున కొలువుదీరాడు గజాననుడు. లంబోదరుడు… సంకష్టహర మహాగణాధిపతిగా కామారెడ్డిలో భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్నాడు. పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో కొన్నేండ్లుగా నిత్య పూజలు అందుకుంటున్నాడు స్వామి. తనను దర్శించడానికి వచ్చిన వారికి ఘనమైన వరాలు అనుగ్రహిస్తున్నాడు.
ధర్మ సమ్మతమైన కోరికతో స్వామికి మడుపు కడితే అది తప్పకుండా నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. వివాహం, ఉద్యోగం, సంతానం, విదేశీ యానం తదితర కోరికలు ఈడేర్చమని భక్తులు స్వామికి ముడుపులు కడుతుంటారు. అంతేకాదు, స్వామివారి సన్నిధిలో మూడు రాత్రులు నిద్ర చేసే సంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది.
ప్రతినెలా సంకష్టహర చవితినాడు మహాగణపతికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. గాణాపత్యంలో లబ్ధప్రతిష్ఠులైన అర్చకస్వాములు ఇక్కడ స్వామివారిని సేవిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి సుమారు 115 కి.మీ. దూరం ఉంటుంది. బస్సు, రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు.