కాలేయం… శరీరంలోని గ్రంథుల్లో అతి పెద్దది. సాలిడ్ ఆర్గాన్స్‌లో పెద్ద అవయవాల్లో ఒకటి. జీర్ణ వ్యవస్థలో దీనిది కీలకపాత్ర. అంతేకాదు శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారుచేసి సరఫరాచేసే ఒక ప్రయోగశాల అని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విష పదార్థాల (టాక్సిన్లు)ను కాలేయం తనలో దాచుకుని శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. అంటే విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడి లాంటిదన్న మాట. తీసుకున్న ఆహారం నుంచి శక్తిని తీసి శరీరానికి అందచేస్తుంది. ఇది పనిచేయకపోతే విష పదార్థాలు శరీర భాగాలకు చేరుకుని మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. గుండె నిరంతరం కొట్టుకుంటున్నట్టే కాలేయం కూడా అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి మరణిస్తాడు. కాలేయం పనిచేయడం మానేసినా, సక్రమంగా పనిచేయకపోయినా మనిషికి ఆయువు తీరినట్టే. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఇతర కారణాల వల్ల కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిలో ప్రధానమైంది ఫ్యాటీలివర్ సమస్య.
కాలేయంలో కొవ్వు అధికంగా చేరడాన్ని ఫ్యాటీలివర్ వ్యాధి అంటారు. అయితే, కాలేయంలో కొవ్వు ఉండటం సాధారణమైన విషయం. 5 శాతం కంటే తక్కువ కొవ్వు ఉంటే దానిని మామూలు విషయంగా పరిగణిస్తారు. కొవ్వు శాతం 5 నుంచి 10 శాతం ఉంటే అది ఫ్యాటీలివర్. సమస్య తీవ్రత ఆధారంగా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3గా విభజిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య చాలావరకు ఆల్కహాల్ (మద్యం) సేవించే వారిలో వస్తుంది. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆల్కహాలిక్ వారికి సమానంగా నాన్ ఆల్కహాలిక్ వారిలోనూ ఈ సమస్య తలెత్తుతుండటం ఆందోళనకరం.
కొంతకాలం క్రితం వరకు ఎవరికైనా ఫ్యాటీలివర్ సమస్య వచ్చిందంటే సదరు రోగి ఆల్కహాలిక్ అని వైద్యులు ఠక్కున గుర్తుపట్టేసేవారు. ముందు మీరు తాగడం మానేయండని హెచ్చరించేవారు. అంటే ఫ్యాటీలివర్ వ్యాధి దాదాపు 90 శాతం ఆల్కహాలిక్ వారిలోనే వచ్చేది. కానీ, ఇప్పుడు మద్యం సేవించని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తున్నది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా కారణాలేవైనా ప్రస్తుతం ఆల్కహాలిక్ వారికి సమాన నిష్పత్తిలో ఆల్కహాల్ సేవించని వారిలోనూ ఫ్యాటీలివర్ సమస్య వస్తున్నది.
ఆల్కహాల్ సేవించకపోయినా కాలేయంలో కొవ్వు పెరిగి ఫ్యాటీలివర్ వ్యాధి రావడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1. ఒబేసిటి (ఊబకాయం)
2. మధుమేహం (షుగర్ నియంత్రణలో లేకపోవడం)
3. జంక్‌ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల చెడు కొవ్వు పదార్థాలు అధికంగా పేరుకుపోవడం
4. హెపటైటిస్-సి
5. టామోగ్జిఫెన్, అమియోడరోన్, మెతోట్రెగ్జేట్ వంటి ఔషధాలతోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్ మందులు దీర్ఘకాలం వాడటం
ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ కంటే నాన్ ఆల్కహాలిక్వారిలో ఫ్యాటీలివర్ సమస్యను గుర్తించడం కొంత కష్టం. నిర్లక్ష్యం చేస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (NAFLD) అనేది నాన్ ఆల్కహాలిక్ స్టిటోహెపటైటిస్ (NASH)గా మారుతుంది. అప్పటికీ సరైన చికిత్స పొందకపోతే అది లివర్ సిరోసిస్‌గా మారుతుంది. అంటే కాలేయానికి చెందిన కణాలు క్షీణించి, కాలేయంపై మచ్చలు లేదా కణుతులు ఏర్పడతాయి. దీంతో కాలేయం గట్టిపడి పూర్తిగా దెబ్బతిని పనిచేయడం మానేస్తుంది. సాధారణంగా నాన్ ఆల్కహాలిక్ వారిలో లక్షణాలు త్వరగా బయటపడవు. చాలా నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. విషయం బయటికి తెలిసేసరికి సమస్య సిరోసిస్‌కు చేరుకుంటుంది. అంటే సమస్య చివరి దశకు చేరుకుని కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. కాలేయం పనిచేయకపోతే రోగి మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, లక్షణాల ఆధారంగా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎలా గుర్తించాలి?
సాధారణంగా ఫ్యాటీలివర్‌ను కిడ్నీ ఇకో టెక్చర్‌తో పోలుస్తారు. ఒక వ్యక్తిలోని కుడి కిడ్నీ ఇకో-టెక్చర్‌కు కాలేయం ఇకో టెక్చర్ సమానంగా ఉండాలి. ఇలా ఉంటే ఫ్యాటీలివర్… అంటే కాలేయంలో కొవ్వు సమస్య లేదని పరిగణిస్తారు. కుడి కిడ్నీ ఇకో-టెక్చర్ కంటే కాలేయం ఇకో టెక్చర్ ఎక్కువగా ఉంటే రోగి ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నట్టు నిర్ధారిస్తారు.
నాన్-ఆల్కహాలిక్ వారిలో వచ్చే కాలేయ వాపు సమస్యకు చికిత్స అందించాలంటే ముందు వ్యాధి కారకాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వ్యాధి ముదిరితే తీవ్రత ఆధారంగా కొన్నిసార్లు కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఫ్యాటీలివర్ అనేది రివర్సబుల్… అంటే కొవ్వు తగ్గితే తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది. అందుకోసం ముందుగా సమస్యను సకాలంలో గుర్తించాలి. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రోగ కారకాలను అడ్డుకోవాలి. దీంతోపాటు సరైన పౌష్టికాహారం తీసుకుంటే 3 నుంచి 6 నెలల్లో ఫ్యాటీలివర్ సమస్యను అధిగమించవచ్చు.