కౌసల్యా సుప్రజా రామా… పూర్వా సంధ్యా ప్రవర్తతే…. అది ఉషోదయానికి పూర్వ వేళ. బాలభానుడు తన తొలి కిరణాలను వికసింపజేయటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. జగన్మోహనాకారుడైన రామచంద్రమూర్తి సోదరుడైన లక్ష్మణునితో కలిసి కఠిన నేల మీద ఆదమరచి పడుకున్నాడు. ‘పుంసాం మోహన రూపాయ’ అన్నట్లున్న స్వామి సౌందర్యాన్ని తనివి తీరా చూసుకున్నాడు మహర్షి. కానీ, అంతలోనే కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. ‘ఉత్తిష్ఠ నరశార్దూలా! కర్తవ్యం దైవమాహ్నికం’- ‘రామచంద్రా! నీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. పడుకున్నది చాలు… ఇక నిద్రలేవాలంటూ’ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర నుంచి మేల్కొలిపాడు.
ఇది రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాతం పేరుతో ఆలయాల్లో నిత్యం వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది. దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం విని స్వామి నిద్రలేస్తాడని, భక్తుల కోర్కెలు సావధానంగా విని, వాటిని తీరుస్తాడని నమ్మకం. సుప్రభాతం కేవలం దైవానికేనా. మనిషి మాత్రం నిద్ర లేవాల్సిన పని లేదా అంటే నిజానికి నిద్ర, మెలకువ లేని దైవం మేల్కొనాల్సిన అవసరమే లేదు. దైవానికి నిద్ర ఉండదు. అదొక నిర్నిద్రమైన శక్తి. దైవానికి పాడే సుప్రభాతం పేరుతో మనలోని దైవత్వాన్ని మేల్కొల్పటమే సుప్రభాత పఠనం వెనుక దాగున్న ఆధ్యాత్మిక సందేశం. గుడిలోని దేవుడి పేరుతో గుండె గదుల్లో దాగున్న దైవీకమైన శక్తిని జాగృతం చేసే ప్రక్రియకు పలికే నాందీ వాచకమే సుప్రభాతం.
సాధారణ పరిభాషలో రాత్రి వేళ నిద్రించి, ఆ నిద్ర ముగిసిన తర్వాత కళ్లు తెరచి లోకాన్ని చూడటాన్ని నిద్రలేవటం అంటాం. నిజానికి ఇలా నిద్ర పోవటం, మేల్కోవటం అనేది ఒక క్రియ మాత్రమే. పుట్టుకతో ఈ లోకాన్ని చూడటానికి చేసే ప్రయత్నమే కన్ను తెరవటం. లోకాల వెనుక జ్యోతి స్వరూపంతో వెలిగే పరమాత్మను చేరుకోవటానికి చేసే ప్రయత్నమే కన్నుమూయటం. ఇలా కన్నుతెరచి, కన్నుమూసే కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగృతం చేసేందుకు చేసే స్వీయప్రబోధమే ‘సుప్రభాతం’. అదే నిద్రలేవటం.
‘కర్తవ్యం దైవమాహ్నికం’- అంటే తెల్లవారిన తర్వాత నువ్వు చెయ్యాల్సిన పని అంతా నీది కాదు… దైవానిది, అటువంటి దైవ కార్యాన్ని నిర్వహించటానికి మేల్కొనాలని అర్థం. మానవత్వమనే పొర వెనుక ప్రతి ప్రాణీ దైవమే. ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పటమే సుప్రభాతం. మనకు ఇష్టమైన దైవానికి మేల్కొలుపు పాడుతున్నామంటే అర్థం ఆ దైవాన్ని త్రికరణశుద్ధిగా మనం నమ్ముతున్నామని, ఆ స్వామి బాటలో నడవటానికి అంగీకరించామని అర్థం. అలా మనం నమ్ముకున్న దైవం మేల్కొన్నాడంటే… మనలో ఆ దైవానికి సంబంధించిన ఉత్తమ భావనలు మేల్కొన్నాయని భావన చేయాలి. ఎప్పుడైతే మనలో దైవీకమైన భావనలు వృద్ధి చెందుతాయో అప్పుడు ధర్మమార్గాన్ని విడిచిపెట్టే సందర్భం ఎదురుకాదు. ఇలా ప్రతి వ్యక్తి… అంతిమంగా సమాజం ధర్మనిలయంగా మారేందుకు పలికే నాందీవాక్యమే సుప్రభాతం.
బ్రాహ్మీ ముహూర్తం
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం…. అంటే 48 నిమిషాల కాల వ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి.
సూర్యోదయ సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండే ముహూర్త కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దీని ప్రకారం రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది.
ఉదాహరణకు సూర్యోదయం ఉదయం గం. 5-58 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) 5-10 నుంచి 5-58 గంటల వరకు ఉండే సమయం ఆసురీ ముహూర్తం అవుతుంది. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు అంటే 5-10 గంటలకు ముందు ఉండే ముహూర్తం అంటే 4-22 నుంచి 5-10 గంటల వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది.
బ్రాహ్మీ అనే పదానికి సరస్వతి అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం చేస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో సరస్వతీ ఉపాసన (విద్యార్థులు చదువుకోవటం కూడా ఉపాసనే) చేసేవారిని చదువుల తల్లి అనుగ్రహిస్తుందని పురాణ కథనం. విద్యార్థులు తెల్లవారుజామున లేచి చదువుకోవాలని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే.
మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. ఉషోదయ వేళ మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందని పెద్దలు చెబుతారు.
ఆధ్మాత్మిక సాధన పరంగా బ్రాహ్మీ ముహూర్తం చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని వృథా చేసుకుంటే రోజులోనే కాదు… మొత్తం జీవితంలోనే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లవుతుంది. శుశ్రుత మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ముహూర్తంగా పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో సత్వగుణాలు పెరుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, అలసత్వం, అజాగ్రత్త) పెరుగుతుంది. అర్ధరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి సమయంలో నిద్రోన్ముఖుడివి కావాలని పెద్దలు చెబుతుంటారు.
బ్రాహ్మీ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వల్ల సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే రుషులు, యోగులు ఈ సమయంలో ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నతస్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మను చేరుకునే సిద్ధి కలుగుతుంది.
తెల్లవారుజామున అంతర్ముఖులమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారుజామున లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాల నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి చైతన్యవంతమవుతుంది.
భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ, దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మన వెంటే ఉంటాయి. ఇందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎంతో అనువుగా ఉంటుంది. ఆయుర్వృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని దేవీభాగవతం కూడా చెబుతున్నది.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి వదిలించి వేస్తుంది. తెల్లవారుజామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువగా తీసుకోగలుగుతాం. సాధారణంగా తెల్లవారుజామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే…మనిషి ఏ సమయంలో నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలి. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్లు తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి.
వాటి ప్రకారం ‘బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితమ్ స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహమ్’సూర్యుడు ఉదయించడానికి రెండు ముహూర్తాలు ముందుగా నిద్రలేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తప్పనిసరిగా నిద్ర నుంచి మేల్కొనాలి. నిద్ర లేచిన తర్వాత వాసుదేవుని అంటే తనకు ఇష్టమైన దేవుణ్ని తలచుకోవాలి.
‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే॥’
‘విశ్వేశం కేశవం ఢుంఢిం దండపాణిం చ భైరవం
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం॥’
ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి. దైవస్మరణం తరువాత మెల్లగా కళ్లు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ‘కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్’అరచేయి కిందివైపు చివర లక్ష్మిని, మధ్యలో సరస్వతిని, మొదట్లో గౌరిని స్మరించాలి. తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత‘సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే॥’అంటూ భూదేవికి ప్రార్థనా పూర్వక నమస్కారం చేసి, ఆ తర్వాతనే కాలు నేలపై మోపాలి….?
-డాక్టర్ కప్పగంతు రామకృష్ణ