Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే స్టార్ హీరోల భారీ సినిమాలతో థియేటర్లు సందడిగా మారిపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి తగ్గిపోయింది. దీంతో బాక్సాఫీస్‌లో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం థియేటర్లలో కొంతమేర మోస్తరు వసూళ్లు సాధిస్తున్న సినిమాగా గోదారి గట్టుపైన నిలవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమా వచ్చే వరకు థియేటర్లకు మళ్లీ ఊపు తీసుకొచ్చే సినిమా ఏదన్న ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వీటిలో ఏదైనా ఒకటి సర్ప్రైజ్ హిట్‌గా నిలిస్తే బాక్సాఫీస్‌కు ఊపిరి పోసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటగా చర్చలో ఉన్న చిత్రం అగ్లీ స్టోరీ. నటుడు నందు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం యూత్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కంటెంట్ పరంగా కొత్తదనం ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది కీలకంగా మారింది.
మరోవైపు పురుషః సినిమా పూర్తి భిన్నమైన జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, వినోదాత్మక అంశాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ట్రైలర్‌తో మంచి బజ్‌ను సంపాదించింది. కొత్త హీరో పవన్ కళ్యాణ్ పరిచయం అవుతున్నప్పటికీ సినిమాలో ఉన్న నటీనటుల ఎంపిక సినిమాపై ఆసక్తిని పెంచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వారంలో అత్యధిక అంచనాలు ఉన్న సినిమా మాత్రం దృశ్యం 3గా కనిపిస్తోంది. మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్‌కు ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఈసారి రీమేక్ కాకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్లో విడుదల అవుతుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ముఖ్యంగా సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ నేరేషన్‌తో వచ్చిన దృశ్యం గత భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే మ్యాజిక్ మూడో భాగంలో కూడా కొనసాగితే, ఈ సినిమా సైలెంట్‌గా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితిని పరిశీలిస్తే, మే నెల చివరి వారం బాక్సాఫీస్‌కు కీలక పరీక్షగా మారినట్లు కనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా, బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఈ చిత్రాలు నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది.. సమ్మర్ సీజన్ చివర్లో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ కొట్టే సినిమా ఏది అని అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.